నయనతార తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి సంకేతమా?
లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా కాలంగా తన చుట్టూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించుకున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా కాలంగా తన చుట్టూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించుకున్నారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రజల్లో కనిపించడం, సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉండడం, తన యాక్టింగ్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె బ్రాండ్‌లో భాగంగా మారిపోయాయి. అదే కారణంగా ఆమె ప్రజల్లో కనిపించే ప్రతి సందర్భం ఒక ప్రత్యేక డిస్కషన్‌కు దారి తీస్తుంది.
అయితే రీసెంట్ గా టాక్సిక్ ప్రమోషనల్ ఈవెంట్లలో ఆమె పాల్గొనడం కేవలం ఒక పార్టిసిపేషన్ గా చూడలేం. ఇది పర్సనల్ ఇమేజ్‌లో వచ్చిన మార్పు కంటే, స్టార్‌డమ్ కొత్త నియమాలను అంగీకరించే స్ట్రాటజిక్ డెసిషన్ గా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో స్టార్ పవర్ మాత్రమే చాలనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజులు, సోషల్ మీడియా ఇంపాక్ట్, డిజిటల్ విజిబిలిటీ వంటి అంశాలు ప్రమోషన్స్‌ను సినిమాకు కీలక భాగంగా మార్చేశాయి.
ముఖ్యంగా ఒక సినిమా రిలీజ్ తర్వాత తరచుగా వినిపించే విమర్శల్లో ప్రమోషన్స్ చేయలేదు అనేది కూడా ఒకటి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, నటీనటులు ప్రేక్షకుల ముందుకు రాలేదనే అభిప్రాయం చాలా వేగంగా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్థితిని నయనతార ముందుగానే అడ్డుకోవడానికి ప్రమోషన్లలో పాల్గొనడం రిస్క్ మేనేజ్‌మెంట్ దృష్టిలో కూడా ఒక తెలివైన అడుగుగా కనిపిస్తుంది. అంటే సినిమా సక్సెస్‌కు మాత్రమే కాదు, సినిమా తర్వాత వచ్చే నెగెటివ్ నేరేటివ్‌ను కూడా నియంత్రించే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.
ఇందులో మరో ఇంట్రెస్టింగ్ అంశం నయనతార పర్సనల్ ఇమేజ్. ఫ్యాన్స్ తో దూరంగా ఉండే స్టార్ అనే భావన ఆమె చుట్టూ చాలా కాలంగా ఉంది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాతో పాటు నటీనటులతో కూడా కనెక్ట్ కావాలనుకుంటున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా క్లిప్స్ ద్వారా ఏర్పడే ఆ కనెక్షన్ కూడా మార్కెట్ వాల్యూలో భాగమవుతోంది.
అందుకే నయనతార ప్రమోషన్స్‌లో కనిపించడం కేవలం ఒక ఈవెంట్ అటెండ్ చేయడం కాదు. అది నిర్మాతకు మద్దతు ఇవ్వడం, సినిమా టీమ్ లో భాగమవడం, విమర్శలకు ముందస్తు సమాధానం చెప్పడం, అలాగే తన బ్రాండ్‌ను కొత్త తరం ప్రేక్షకులకు మళ్లీ పరిచయం చేయడం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. ఈ యాంగిల్ లో చూస్తే, నయనతార ప్రమోషన్స్‌కు రావడం, మారుతున్న సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ కూడా మారాల్సిందే అనే వాస్తవాన్ని అంగీకరించనట్టే అనిపిస్తోంది.