కన్నడ మూవీ టీజర్... తెలుగు రాష్ట్రాల్లో చర్చ
సోషల్ మీడియా వల్ల భాష ఏదైనా, సినిమా ఏదైనా అందరి వద్దకు చేరుతుంది. కంటెంట్ బాగుంటే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ కావడం ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం.
సోషల్ మీడియా వల్ల భాష ఏదైనా, సినిమా ఏదైనా అందరి వద్దకు చేరుతుంది. కంటెంట్ బాగుంటే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ కావడం ఈమధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో కన్నడ కొత్త మూవీ 'వసుదైవ కుటుంబకం' టీజర్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా ముఖ్య పాత్రలో నటించిన మూవీ. ఈ సినిమాకు నంద సుధీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన పొగరు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకే సినిమాను ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా భారీ బడ్జెట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందిస్తున్నట్లుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు. తాజాగా హీరో ధృవ సర్జా పుట్టిన రోజు సందర్భంగా వసుదైవ కుటుంబకం సినిమా నుంచి టీజర్ను వదిలారు. ఆ టీజర్ విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.
ధృవ సర్జా హీరోగా వసుదైవ కుటుంబకం...
ధృవ సర్జా ఫ్యాన్స్‌తో పాటు, కన్నడ సినీ ప్రేక్షకులు వసుదైవ కుటుంబకం సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ విలువలు ఉండబోతున్న సినిమా అని, మంచి మాస్ యాక్షన్ ఉండే సినిమాగా కూడా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ టీజర్ చూసిన తర్వాత ఎక్కడో చూసినట్లు ఉందే అని చర్చించుకుంటున్నారు. ఈ సినిమాను ప్రధానంగా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమాతో పోల్చుతున్నారు. అందుకు చాలా కారణాలు సైతం ఉన్నాయి. శ్రీమంతుడు అనగానే మహేష్ బాబు సైకిల్ పై ఉన్న పిక్చర్ మన మైండ్‌లోకి వస్తుంది. తాజాగా విడుదలైన వసుదైవ కుటుంబకం సినిమా టీజర్‌లోనూ హీరో ధృవ సర్జా సైకిల్ పై కనిపించాడు. పైగా శ్రీమంతుడు సినిమాలో ఎలా అయితే పల్లెటూరులో మహేష్ బాబు సైకిల్ పై తిరుగుతాడో అదే విధంగా ధృవ సర్జా పల్లెటూరు రోడ్డు మీద సైకిల్ రైడ్ చేస్తున్నాడు.
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో...
ఇక శ్రీమంతుడు సినిమాలో ఒక కుస్తీ ఫైటర్స్‌తో యాక్షన్ సీన్ ఉంటుంది. అలాంటిదే ఈ సినిమాలోనూ ఉండేలా ఉంది. అయితే టీజర్‌లో కుస్తీకి రమన్ని మల్లయోధుడు పిలిస్తే ఫ్యామిలీ కోసం వచ్చాను అనే డైలాగ్ ఉంది. ఇక శ్రీమంతుడు థీమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఉన్నది ఉన్నట్లుగా దించి ఈ టీజర్ కు వాడేశారు. టీజర్ విన్న ఏ తెలుగు వారు అయినా ఇది శ్రీమంతుడు మ్యూజిక్ అని ఈజీగా చెప్పేయవచ్చు. అందుకే ఈ సినిమాను శ్రీమంతుడు సినిమాకు రీమేక్ అంటున్నారు. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా వచ్చి దాదాపుగా 11 ఏళ్లు అవుతున్న విషయం తెల్సిందే. అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీమంతుడు అన్ని భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓటీటీల కారణంగా శ్రీమంతుడు సినిమాను కన్నడ ప్రేక్షకులు సైతం చూసే ఉంటారు. ఈ పదేళ్ల కాలంలో కన్నడ ప్రేక్షకులు చాలా సార్లు శ్రీమంతుడు సినిమాను చూసి ఉంటారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
వసుదైవ కుటుంబకం వర్సెస్ శ్రీమంతుడు...
ధృవ సర్జా హీరోగా రూపొందుతున్న వసుదైవ కుటుంబకం సినిమా నిర్మాతలు మాత్రం దీన్ని ఒక రీమేక్‌గా ఇప్పటి వరకు ప్రకటించలేదు. దాంతో ఆ మధ్య తమిళనాట వచ్చిన జన నాయగన్ సినిమా ఎలా అయితే సెమీ రీమేక్ అన్నట్లుగా నిలిచిందో అలాగే ఈ సినిమా సైతం శ్రీమంతుడు సినిమాకు సెమీ రీమేక్ అయి ఉంటుందని కొందరు అంటున్నారు. మొత్తానికి వసుదైవ కుటుంబకం సినిమా గురించి కన్నడ ప్రేక్షకులు ఎలా అయితే చర్చించుకుంటున్నారో అలాగే తెలుగు ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరి వసుదైవ కుటుంబం ఎంత వరకు శ్రీమంతుడు రీమేక్ అనే విషయం తెలియాలి అంటే షూటింగ్ పూర్తి కావాలి, వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. హీరోయిన్ ఎవరు అనేది కూడా క్లారిటీ లేదు. త్వరలోనే అన్ని వివరాలను వివరిస్తామని మేకర్స్ చెబుతున్నారు.