హాలీవుడ్ లో లాంచ్ అవ్వాల‌నుకున్న అమాయ‌క హీరో!

ఆ సినిమా వరుణ్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు ఆయనను యూత్ ఐకాన్‌గా మార్చేసింది. హాలీవుడ్ కల నెరవేరకపోయినా?;

Update: 2026-03-28 17:30 GMT

వరుణ్ ధావన్ బాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో న‌టుడిగా మ‌రింత బిజీ అయ్యాడు. మార్కెట్ లో ఎంత పోటీఉన్నా? త‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉండ‌టంతో తిరుగులేని స్టార్ గా దూసుకుపోతున్నాడు. యాక్ష‌న్ కం ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూ త‌న‌కు తానే పోటీగా మారుతున్నాడు. తాజాగా తన కెరీర్ ఆరంభంలో ఎవరికీ తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. సాధారణంగా స్టార్ కిడ్స్ బాలీవుడ్‌లో లాంచ్ అవ్వాలని కలలు కంటారు. కానీ వరుణ్ మాత్రం ఏకంగా హాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ప్లాన్ చేశారట. అది కూడా సాదాసీదాగా కాదు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో తన తొలి సినిమా ఉండాలని ఆయన ఆశపడ్డారు.

తన తండ్రి ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే వరుణ్‌కు ఈ ఆలోచన వచ్చింది. `నేను హాలీవుడ్ వెళ్ళిపోతాను. అక్కడ స్పీల్బర్గ్ నన్ను లాంచ్ చేస్తారు` అని తన తండ్రికి చెప్పినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారని వరుణ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనలో ఉన్న అమాయకత్వం ,ఆత్మవిశ్వాసం చూసి డాడ్ ఆశ్చర్యపోయేవారని సరదాగా వ్యాఖ్యానించారు. హాలీవుడ్ ప్రయత్నాలు పక్కన పెట్టి కరణ్ జోహార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సినిమాతో వ‌రుణ్ ధావ‌న్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఆ సినిమా వరుణ్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు ఆయనను యూత్ ఐకాన్‌గా మార్చేసింది. హాలీవుడ్ కల నెరవేరకపోయినా? ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుస హిట్లతో వ‌రుణ్ సత్తా చాటుకున్నాడు. వరుణ్ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ `అప్పట్లో నాకు ప్రపంచం చాలా చిన్నదిగా అనిపించేది. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఇక్కడ పోటీ కష్టం ఎంత ఉంటుందో అర్థమైంది` అన్నాడు. కరణ్ జోహార్ తనను సరైన సమయంలో గుర్తించి మంచి బ్రేక్ ఇచ్చార‌న్నాడు. తన తండ్రి డేవిడ్ ధావన్ సలహాలు కూడా తన ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డా యన్నాడు.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. `ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద కల ఉండాలి. అది నెరవేరుతుందో లేదో పక్కన పెడితే ఆ ప్రయత్నం ఏదో ఒక దిశగా నడిపిస్తుంది` అనే సందేశం వ‌రుణ్ ధావ‌న్ మాటల్లో కనిపిస్తోంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన్ `బోర్డ‌ర్ 2` తో వ‌రుణ్ ధావ‌న్ ఖాతాలో మ‌రో భారీ విజ‌యం న‌మోదైన సంగ‌తి తెలిసిందే.ప్ర‌స్తుతం `ఏ జ‌వానీ తోహ్ ఇష్క్ హోనా హై` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో స‌రైన అవాశం వ‌స్తే ఇక్క‌డా లాంచ్ అవ్వాల‌ని ఎదురు చూస్తున్నాడు. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌త్తా చాట‌డంతో? వ‌రుణ్ తెలుగు సినిమాల‌పై చాలా ఆస‌క్తిగా ఉన్నాడు.

Tags:    

Similar News