ట్రైలర్ టాక్: ధావన్ బోయ్ జీవితంలో మాజీ ప్రేయసి రొమాంటిక్ ట్విస్టు
రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.;
రొమాంటిక్ కామెడీలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని ఇటీవల విడుదలైన కొన్ని హిందీ సినిమాలు నిరూపించాయి. ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని `సయ్యారా` లాంటి చిత్రం నిరూపించింది. అందుకే త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న `సన్నీ సంస్కారి కి తులసి కుమారి` చిత్రంపై అంచనాలేర్పడ్డాయి. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. లవ్, స్మైల్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ నేపథ్యంలో ఆద్యంతం వినోదం పంచే చిత్రమిది. ఇందులో వరుణ్ ధావన్ లవర్ బోయ్ గా కనిపిస్తున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన చిత్రంలో వరుణ్ ధావన్ - జాన్వి కపూర్ నడుమ `ఎక్స్` ఫ్యాక్టర్ ఏమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
షాదీ సెటప్ తో పాటు, అత్యుత్తమ ఫ్యామిలీ డ్రామాతో సినిమా ఆద్యంతం సాగనుందని అర్థమవుతోంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్, అక్షయ్ ఒబెరాయ్, మనీష్ పాల్ వంటి టాప్ స్టార్లతో ఈ చిత్రం రూపొందుతోంది. కలిసి మెలిసి ఉండటం, ప్రేమ, హాస్యం తో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే లైటర్ వెయిన్ పాయింట్ తో రూపొందుతోంది. ట్రైలర్ ఆద్యంతం హాస్యంతో రక్తి కట్టించింది. థియేటర్లలో కుటుంబ సమేతంగా చూడదగ్గ కంటెంట్ ని అందిస్తున్నామని దర్శకుడు శశాంక్ అంటున్నారు. సంబంధ బాంధవ్యాలు, కుటుంబ వేడుకలతో ఆద్యంతం రక్తి కట్టించేలా సినిమాని రూపొందిస్తున్నామని అతడు వెల్లడించారు.
ఈ సినిమాలో ఎక్స్ ఫ్యాక్టర్ ఏమిటి? .. మాజీ ప్రేయసితో కథానాయకుడు పడే పాట్లు ఎలాంటివి? అన్నది తెరపైనే చూడాలి. ఇందులో వరుణ్ ధావన్ బాహుబలి గెటప్ తో ఎందుకు కనిపించాడు? ఈ సీన్ లో ఫన్ ఎలా వర్కవుటైంది? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతిభావంతులతో రూపొందించిన ఈ చిత్రం ధావన్ కెరీర్ బెస్ట్ అవుతుందని భావిస్తున్నారు. ట్రైలర్ తో మొదటి ఇంప్రెషన్ కలిగింది. సినిమా ఆద్యంతం ఇదే తరహా హుషారు, హాస్యం వర్కవుటైతే పెద్ద మ్యాజిక్ జరిగేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.