బాహుబలి 2- RRR క్రేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో 'వారణాసి' ప్రీ-బిజినెస్ హవా!

అయితే ఇప్పుడు `వారణాసి` చిత్రం ఈ రెండు ఇండస్ట్రీ హిట్లను వెనక్కి నెట్టి.. ప్రీబిజ్‌లో ఎవరూ ఊహించని మైలురాయిని తాకనుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.

Update: 2026-09-07 04:08 GMT

తెలుగు చిత్రసీమ స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి` చిత్రం బాక్సాఫీస్ రికార్డులను సృష్టించక ముందే ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి 2` చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 122 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన `ఆర్‌ఆర్ఆర్` (RRR) చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & TS) ఏకంగా 230 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించి రికార్డు నెలకొల్పింది. అయితే ఇప్పుడు `వారణాసి` చిత్రం ఈ రెండు ఇండస్ట్రీ హిట్లను వెనక్కి నెట్టి.. ప్రీబిజ్‌లో ఎవరూ ఊహించని మైలురాయిని తాకనుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.

ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల విశ్లేషణల ప్రకారం.. `వారణాసి` సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ థియేట్రికల్ హక్కుల రూపంలోనే ఏకంగా 320 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. `బాహుబలి 2` బిజినెస్‌తో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు కాగా, `ఆర్‌ఆర్ఆర్` ప్రీ-రిలీజ్ బిజినెస్ కంటే దాదాపు 90 కోట్లు అధికం. తెలుగు సినిమా చరిత్రలోనే కేవలం ఒక ప్రాంతీయ మార్కెట్ నుండి ఈ స్థాయిలో 300 కోట్ల మార్కును దాటి థియేట్రికల్ బిజినెస్ జరగడం నిజంగా ఒక అసాధారణమైన సంచలనంగా విశ్లేషిస్తున్నారు. ఇది రాజమౌళి బ్రాండ్ వాల్యూకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ హైప్ పెరగడానికి ప్రధాన కారణం మూవీకి ఎంచుకున్న‌ భారీ బడ్జెట్- యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్. దాదాపు 1300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ అప్పీల్ ఉన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా భాషల్లో.. 120కి పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ విజయం తర్వాత రాజమౌళికి అంతర్జాతీయంగా లభించిన గుర్తింపు.. మహేష్ బాబు మార్కెట్ స్టామినా కలవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంపై ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించడానికి సిద్ధపడతున్నారు.

ఇక నటీనటులు.. పాత్రల పరంగానూ `వారణాసి` ప్రేక్షకుల్లో గొప్ప‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర, పురాణ పురుషుడు శ్రీరాముడుగా.. రెండు విభిన్నమైన పవర్ ఫుల్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. మహేష్ సరసన గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం.. కే.ఎల్. నారాయణ - ఎస్.ఎస్. కార్తికేయలు సంయుక్తంగా నిర్మిస్తుండటం ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను మరింత పెంచాయి.

ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ 80 రోజుల టాకీ పార్ట్‌ను వేగంగా పూర్తి చేసుకుని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఆర్‌ఆర్ఆర్, పుష్ప 2 చిత్రాలు నెలకొల్పిన బాక్సాఫీస్ రికార్డులు.. ప్రీబిజ్ రికార్డులను తిరగరాసే దిశగా `వారణాసి` అడుగులు వేస్తోంద‌నే స‌మాచారం ఉత్కంఠ‌కు గురి చేస్తోంద‌. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 320 కోట్ల బిజినెస్ లెక్కలు దాటిన ఈ పాన్-వరల్డ్ చిత్రం... థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందోనని ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News