పైడిపల్లి రూటే వేరు
దర్శకుడిగా ఒక స్థాయి అందుకున్నాక పెద్ద స్టార్లతోనే సినిమాలు చేయాలని అనుకుంటారు. కానీ ప్రతిసారీ పెద్ద స్టార్ హీరోనే దొరుకుతాడనే గ్యారెంటీ ఉండదు.;
దర్శకుడిగా ఒక స్థాయి అందుకున్నాక పెద్ద స్టార్లతోనే సినిమాలు చేయాలని అనుకుంటారు. కానీ ప్రతిసారీ పెద్ద స్టార్ హీరోనే దొరుకుతాడనే గ్యారెంటీ ఉండదు. వారి కోసం చాలా సమయం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే తమ ఫామ్ బాగా లేకపోతే వెయిటింగ్ టైం ఇంకా పెరిగిపోతుంది. అలాంటపుడు కొందరు దర్శకులు కొంచెం స్థాయి తగ్గించుకుని మిడ్ రేంజ్ హీరోలతో వెళ్లిపోతుంటారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం ఇందుకు భిన్నం.
ఆయన ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడానికి రెడీ కానీ.. రేంజ్ తగ్గించుకుని చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం తీయడు. పైడిపల్లి గొప్ప గొప్ప సినిమాలేమీ తీసింది లేదు. సగటు మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడు. ఒక ఫారిన్ మూవీకి రీమేక్‌గా చేసిన ‘ఊపిరి’ని మినహాయిస్తే వంశీవి ఒక టెంప్లేట్లో సాగిపోయే సగటు మసాలా కథలే. తన సినిమాలు ఒక మోస్తరుగా ఆడుతుంటాయి. కానీ పెద్ద హీరోలు ఎగ్జైట్ వంశీతో సినిమా చేద్దాం అని రేంజిలో అయితే తన కథలు.. తన సినిమాల ఫలితాలు ఉండవు. అందుకే ఒక సినిమా అయ్యాక చాలా గ్యాప్ వస్తుంటుంది.
పదేళ్ల వ్యవధిలో వంశీ చేసిన సినిమాలు కేవలం మూడు. 2016లో ‘ఊపిరి’ రిలీజైతే 2019లో మహేష్ బాబు సినిమా ‘మహర్షి’ వచ్చింది. తర్వాత నాలుగేళ్లకు తమిళ స్టార్ విజయ్‌తో ‘వారిసు’ తీశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లి.. అటు నుంచి బాలీవుడ్‌లో తేలాడు వంశీ. ఇప్పుడు అతను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు.
కెరీర్ ఆరంభం నుంచి వంశీ.. దిల్ రాజు సంస్థకు ఆస్థాన దర్శకుడిగా మారాడు. బయటి ఇండస్ట్రీల్లో కూడా వంశీ సినిమాలను రాజే నిర్మిస్తున్నాడు. సల్మాన్ సినిమాకు కూడా ఆయనే ప్రొడ్యూసర్. ముందు ఆమిర్ ఖాన్ కోసం ప్రయత్నించి ఫెయిలైన వంశీ.. సల్మాన్‌తో ఫిక్స్ అయ్యాడు. చాలా ఏళ్లుగా సరైన విజయాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సల్మాన్.. వంశీని నమ్ముకున్నాడు. తనదైన శైలిలో మసాలాలు వేసి.. సల్మాన్‌కు హిట్ సినిమా అందిస్తాడేమో చూడాలి.