‘కూలీ’ విమర్శలకు ఉపేంద్ర సమాధానం

ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీ సూపర్ స్టార్లలో ఒకడు. హీరోగానే కాక దర్శకుడిగానూ ఆయనకు గొప్ప పేరే ఉంది.;

Update: 2025-12-23 16:30 GMT

ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీ సూపర్ స్టార్లలో ఒకడు. హీరోగానే కాక దర్శకుడిగానూ ఆయనకు గొప్ప పేరే ఉంది. అలాంటి నటుడు ఒక సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందనే ఆశిస్తారు. ఆ పాత్రకు చెప్పుకోదగ్గ నిడివి, అలాగే కథలో ప్రాధాన్యం ఉంటుందని అంచనా వేస్తారు. కానీ ‘కూలీ’ సినిమాలో ఉపేంద్ర క్యారెక్టర్ని చూసి ఆయన అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. సామాన్య ప్రేక్షకులకు కూడా ఆ పాత్ర రుచించలేదు.

ఈ చిత్రంలో హీరో రజినీకాంత్ సహా ఈ క్యారెక్టరూ అంచనాలకు తగ్గట్లు లేదు, క్లిక్ కాలేదు అన్నది వాస్తవం. వాటిలో ఉపేంద్ర పాత్రయితే మరీ తీసికట్టుగా తయారైంది. మరి ‘కూలీ’ సినిమాలో మీ పాత్రపై వచ్చిన విమర్శల మాటేంటి.. మీరు ఇలాంటి ప్రాధాన్యం లేని క్యారెక్టర్ ఎందుకు చేశారు అని ఉపేంద్రను ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

‘‘కూలీ సినిమా విషయంలో నాకు ఎంతమాత్రం బాధ లేదు. అది నాకు కలలో కూడా ఊహించని అవకాశం. ఎందుకంటే అది రజినీకాంత్ సినిమా. నేను ఆయనకు కేవలం ఫ్యాన్ కాదు.. భక్తుడిని. ఆయన సినిమాలో నేను నటించడం అన్నది చాలా పెద్ద విషయం. రజినీతో కలిసి జస్ట్ ఒక షాట్‌‌లో కనిపించినా చాలు. నేను చేయడానికి సిద్ధం. అందుకే ఆ పాత్ర ఎలాంటిదన్నది కూడా ఆలోచించకుండా ఆ సినిమా ఒప్పుకున్నా. నిజానికి నేను అందులో చిన్న ఫైట్లో మాత్రమే కనిపించాలి. కానీ తర్వాత ఆ పాత్రను ఇంకొంచెం డెవలప్ చేసి మరి కొన్ని సీన్లు జోడించారు.

రజినీ అంటే నాకు పిచ్చి. ఆయన సినిమాలకు మించి.. తన ఫిలాసఫీకి నేను వీరాభిమానిని. ‘‘నేను ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు’’.. ‘‘దేవుడు శాసిస్తాడు. అరుణాచలం పాటిస్తాడు’’ లాంటి డైలాగులు నా మీద చాలా ప్రభావం చూపాయి. ఆయనకు సంబంధించి చిన్న వీడియో వచ్చినా అదే పనిగా చూస్తుంటా. ‘జైలర్’ సినిమా ఆడియో వేడుకలో గంటంబావు సేపు మాట్లాడారు. ఆ స్పీచ్ వింటుంటే నాకు ఆయన సినిమాలు చూడాల్సిన పని లేదు. ఇలా స్పీచ్‌లు వింటూ ఉంటే చాలు అనిపించింది. నాకు ఆయనంటే అంత అభిమానం’’ అని ఉపేంద్ర తెలిపాడు.

Tags:    

Similar News