మా వందే: మోదీ బయోపిక్ లో వైలెంట్ హీరో!
భారతీయ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం సినిమాగా తెరకెక్కుతోంది.;
భారతీయ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం సినిమాగా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సిల్వర్ క్యాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నారు. మా వందే అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఉన్నీ ముకుందన్ మోదీ పాత్రలో నటించనుండటం హాట్ టాపిక్ గా మారింది. మార్మో సినిమాలో వైలెంట్ గా కనిపించిన ముకుందన్ మోదీ గా కనిపించడం సో స్పెషల్. క్రాంతి కుమార్ సి.హెచ్. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల అవగానే అంచనాలు మరింతగా పెరిగాయి. మోదీ గారి తల్లి హీరాబెన్‌తో ఉన్న బంధం, ఆయన బాల్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రయాణం, దేశ నాయకుడిగా ఎదిగిన విధానం అన్నీ ఈ సినిమాలో చూపించనున్నారు. మోదీ గారి అసలైన వ్యక్తిత్వాన్ని, ఆయన సంకల్పబలాన్ని, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను సహజంగా ప్రతిబింబించేలా కథను తీర్చిదిద్దుతున్నారని మేకర్స్ తెలిపారు.
ప్రత్యేకంగా మోదీ గారి తల్లితో ఉన్న అనుబంధం ఈ సినిమాలో భావోద్వేగ ప్రధానమైన అంశంగా చూపించనున్నారు. ఆయన చిన్ననాటి నుంచి పెరిగే వరకూ తల్లిదండ్రుల విలువలు, తల్లితో ఉన్న అనుబంధం ఆయన నాయకత్వ శైలిపై ఎలా ప్రభావం చూపిందో సున్నితంగా చూపించబోతున్నారు. “ఎన్నో పోరాటాల కన్నా.. తల్లి సంకల్పం గొప్పది” అన్న ట్యాగ్ తో ఈ చిత్రాన్ని మా వందే.. ది ఆంథమ్ ఆఫ్ ఎ మదర్ అనే టైటిల్‌తో ప్రకటించడం విశేషం.
సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. కెమెరామెన్‌గా కె.కె. సెంథిల్ కుమార్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ పని చేస్తున్నారు. యాక్షన్ మాస్టర్ కింగ్ సోలమన్ కంపోజ్ చేయనున్న యాక్షన్ సన్నివేశాలు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందిస్తున్న సంగీతం సినిమాకి హైలైట్ కానున్నాయి. విఎఫ్ఎక్స్, టెక్నికల్ స్టాండర్డ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీతో పాటు ఆంగ్ల భాషలోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పాన్ ఇండియా సినిమాగా కాకుండా, ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద, మా వందే ఒక సాధారణ బయోపిక్ కాదని, ఇది ఒక భారతీయ నాయకుడి గొప్ప ప్రయాణాన్ని చూపించే గాథ అని చెబుతున్నారు. మరి ఈ బయోపిక్ లో ఎలాంటి అంశాలను హైలెట్ చేస్తారో చూడాలి.