ఎవరైనా డోర్ మూసేస్తే వెయిట్ చేయొద్దు.. మన డోర్ మనమే.. : ఉదయభాను
ఆమె కామెంట్స్ లో ఇండస్ట్రీలో తన జర్నీ కనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే కొన్నిసార్లు మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఛాన్సులు రావు. అలాంటి సమయంలో నిరాశ చెందకుండా మన వే ని మనమే సెట్ చేసుకోవాలని స్టార్ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను అన్నారు. ఇతరులు మన స్టామినా డిసైడ్ చేయకూడదని.. మనపై మనకు నమ్మకం ఉండాలని సూచించారు.
లేటెస్ట్ గా జరిగిన పంచనామా వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో ఉదయభాను తన ఎక్స్పీరియెన్సెస్ ను షేర్ చేసుకున్నారు. "మీరు ఎప్పుడు ఏదైనా అనుకుంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ తోనే చూస్తారు. మనం కచ్చితంగా చేస్తామని ఎవరూ అనుకోరు. చాలా మంది మనకు లిమిట్ గీస్తారు. కానీ మన సత్తా ఏంటో మనకు మాత్రమే తెలుసు. ఇతరులకు మన స్టామినా పూర్తిగా తెలియదు" అని ఆమె అన్నారు.
జీవితంలో ఏదైనా ఛాన్స్ మిస్ అయినప్పుడు అక్కడే ఆగిపోకూడదని ఉదయభాను చెప్పారు. ఒక తలుపు మూసుకుపోతే.. అదే డోర్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురుచూడకుండా కొత్త తలుపును మనమే క్రియేట్ చేసుకోవాలని అన్నారు. "మీకు ఒక డోర్ క్లోజ్ అయి ఉంటే అక్కడ వెయిట్ చేయొద్దు. మీ డోర్ మీరే క్రియేట్ చేసుకోవాలి. మీ మీద మీరే నమ్మకంగా ఉండండి. తలుపు మూసివేసి, గొళ్లెం పెట్టి, నవ్వే వాళ్ల దగ్గర వెయిట్ చేయకండి" అని ఉదయభాను చెప్పారు.
ఆమె కామెంట్స్ లో ఇండస్ట్రీలో తన జర్నీ కనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టారు. ఛాన్సుల కోసం ఎదురుచూడటం కంటే.. కొత్త అవకాశాలను క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనతోనే పంచనామా నిర్మించినట్లు ఆమె కామెంట్స్ బట్టి అర్థమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఉదయభాను నిర్మించిన పంచనామా వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ తో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఉదయభాను ప్రొడక్షన్స్ బ్యానర్ పై మిడ్డే విజయేంద్ర మౌళితో కలిసి ఉదయభాను నిర్మించారు. మోహన్ శ్రీవత్స్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ యాక్టర్ భరత్ పోలీస్ అధికారి జై రామ్ రోల్ లో కనిపించనున్నారు. శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓ మరణాన్ని తొలుత ప్రమాదంగా భావించినప్పటికీ.. దాని వెనుక ఉన్న అనుమానాలను ఛేదించేందుకు జై రామ్ దర్యాప్తు మొదలుపెడతాడు. విచారణలో మూడు మరణాల మధ్య ఉన్న లింకులు బయటపడటంతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. రాజకీయ అవినీతి, క్రిమినల్ కుట్ర, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పంచనామాను రూపొందించారు. మరి సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఆ సిరీస్ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ అందిస్తుందో చూడాలి.