ఆంధ్రా యూనివర్శిటీని ఊపేసిన త్రివిక్రమ్ స్పీచ్
ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పొయెట్రీ ఎక్కువ రాశాను.;
``మనం పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది.. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం పుట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం కనిపెట్టక ముందు నుంచి ఇవి ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. సో మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప.. అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది``` ఇంత పోయెటిగ్గా ఎవరు స్పీచ్ ఇవ్వగలరు? అంటే .. కచ్ఛితంగా అది త్రివిక్రమ్ మాత్రమే.. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ విద్యార్థుల్లో గూస్ బంప్స్ తెచ్చింది. మాటల మాంత్రికుడు మరోసారి తన మాటల మాయాజాలాన్ని చూపించారు.
ముందుగా పెద్దలందరికీ వందనాలు చెప్పిన త్రివిక్రమ్..ఇంతమంది ముందు మాట్లాడడమంటేనే కొంచెం భయంగా ఉంది.. మోకాళ్ళు వణుకుతున్నాయి. కానీ లక్కీగా పోడియం పెట్టారు కాబట్టి మీకు ఎవరికీ కనపడదు... అంటూ తనదైన చలోక్తి విసిరారు.
ఇక్కడ మాట్లాడే అర్హత నాకు ఎంత ఉందో నాకు తెలియదు. కేవలం ఇక్కడ నేను కూడా ఒక పూర్వ విద్యార్థిని అనే ఒక అభిమానంతో పిలిచినట్టున్నారు. బేసిక్ గా విశ్వవిద్యాలయం మీద నాకు వచ్చిన అవగాహన చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకేం అవగాహన లేదు..ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంత అవగాహన వచ్చింది. సో ఇన్ని సంవత్సరాల్లో నాకు నేను అర్థం చేసుకుంది కొంత.. ఇక్కడ నేను ఇంకా ఏం నేర్చుకుని ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది.. కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీకు ఏమాత్రం ఉపయోగం కలిగినా.. కొద్దిగా అయినా మీ మెదళ్లకు అది ఏమైనా పనికొచ్చినా.. మీ ఇన్సైట్ కి అది ఉపయోగపడినా ఐ విల్ బి వెరీ హ్యాపీ.
ముఖ్యంగా `యూనివర్సిటీ`లోనే రెండు మాటలు ఉన్నాయి. డైవర్సిటీ... `యూనిసన్` ఒకటి ఉంది. కాబట్టి చాలా విభిన్నమైన ఆలోచనల్ని ఒకే చోటకి కలిపి తీసుకొచ్చే ప్లేస్ ని యూనివర్సిటీ అంటారని నా ఉద్దేశం. ఇక్కడ చెప్పడం కంటే కూడా మీరు నేర్చుకోవడం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు విద్య అంటే ఎక్కడో ఉన్నదాన్ని లేదంటే మీకు కనబడని దాన్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం కాదు.. మీ ఎదుటే ఉన్నదాన్ని.. మీరు అప్పటిదాకా ఆ దృక్కోణంలో చూడని దాన్ని.. మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచోపెట్టి చూపించడం.
నేనైతే ఇలా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మీరు పరిశీలిస్తే ఫిజిక్స్ లో ఒక సూత్రం ఉంది.. చాలా బేసిక్ సూత్రం ఇ=ఎంసి స్క్వేర్ ...సైంటిస్ట్ ఏం చెప్తాడంటే.. ఒక ఎనర్జీని మీరు సృష్టించలేరు.. ఎనర్జీని నాశనం చేయలేరు.. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి మార్చగలరు అంతే. అట్లాగే ఇది మీరు అన్నిటికీ అప్లై చేయండి. మనం పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది.. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం పుట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం కనిపెట్టక ముందు నుంచి ఇవి ఇక్కడే ఉన్నాయి. మనం కనిపెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. కాబట్టి మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప..అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక వేదికగా యూనివర్సిటీని భావించాలని మీ అందరికీ చెబుతాను.
ఎందుకంటే ఇదొక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదట ఎవరు వచ్చినా ముందు భయపెడుతుంది. 500 ఎకరాల కంటే ఎక్కువ.. రోడ్లు ఎంత నడిచినా తరగవు. పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడీ వినపడనట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు.. అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్ గాను.. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ ని ఇస్తాయి. మందు చేదుగానే ఉంటుంది..ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు. కానీ అది మనకి చాలా ఉపయోగకరమైనది.. అదే మనకు ఉపయోగపడుతుంది. మనల్ని బాగు చేస్తుంది.. మనల్ని రిపేర్ చేస్తుంది.. మనల్ని మళ్ళీ ఆరోగ్యవంతులను చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది కానీ దీన్ని అలవాటు చేసుకోండి.. దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి.
ఎందుకంటే మనమందరం వేరే వేరే కల్చర్స్ నుంచి.. వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం. మనకందరికీ ఎలా ఉంటుందంటే మన భాషే గొప్పది.. మన మాటే గొప్పది...మన మాండలికమే గొప్పది లేదంటే మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావనలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయడంతో పాటు నేర్పడానికే ఈ ప్లేస్ ఉంది. అందుకే దాదాపుగా 130 కంటే ఎక్కువ దేశాల నుంచి ఇక్కడికి ఎందుకు జనాన్ని పిలిపిస్తారు..వాళ్ళందరి కోసం ఎందుకు ఈ ప్రోగ్రాంని పెడతారు.. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు కలుపుతారు అంటే.. ఫస్ట్ అందరినీ కలవటం మూలంగా మీకు చాలా విషయాల మీద మీకు ఉండేటువంటి ఆలోచనలో మార్పు వస్తుంది కాబట్టి. కలవటం మూలంగానే గెలవడం అనేది జరుగుతుంది ఏ మనిషికైనా సరే.
నేను ముగించే ముందుగా ఒకే ఒక మాట చెప్తాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సింబల్ లోనే ఉంటుంది```తేజస్వినా వధిహితమస్తు మావిద్విషామహే`` అని. సో ఈ తేజస్సుతో కూడినటువంటి విద్య మీ ధీశక్తిని మరింతగా పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవటం మూలంగా మనమందరం కూడా మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్లో ప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది తొలి మెట్టు కావాలని కోరుకుంటున్నాను.
ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పొయెట్రీ ఎక్కువ రాశాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. కాబట్టి నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది.. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు దేశ విదేశాలకు వెళ్లి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్లారంటే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. సో అలాంటి మీ ప్రయాణాలకి ఇది మొదటి అడుగు కావాలి.
ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు తర్వాతి తరంలో చూడడానికి బహుశా నేను ఉండకపోవచ్చు కానీ..తర్వాత తరాల వాళ్ళకి చాలామంది మార్గదర్శకుల్ని ఇక్కడి నుంచే తయారు చేసేటువంటి ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని... దానికి ఇది ఈ శతాబ్ది మొదటి అడుగుగా ఉండాలని కోరుకుంటున్నాను. వందేళ్ళ పండగ చేసుకున్న వాడిని ఆశీర్వధించేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది.. అలాంటి ఆశీర్వాదాన్ని నేను చేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ. నమస్కారం... అంటూ త్రివిక్రమ్ సుదీర్ఘ నిడివి ఉన్న స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.