మాయావి శైలిని ఫాలో అవుతున్నారా?
'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ బాటలోనే పయనిస్తూ.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను అందిస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్లు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. `మాటల మాంత్రికుడు`త్రివిక్రమ్ శ్రీనివాస్ బాటలోనే పయనిస్తూ.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను అందిస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్లు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చిత్రం ఏంటంటే.. ఆ ఇద్దరి పేర్లూ `వెంకీ` కావడం విశేషం. వారే వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల. వెకిలి కామెడీలకు, అసభ్యతకు తావు లేకుండా హుందాతనంతో కూడిన సంభాషణలు, హ్యూమర్, రొమాన్స్ కలగలిపి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీయడంలో ఈ ఇద్దరూ త్రివిక్రమ్ శైలి వైబ్‌ను క్రియేట్ చేస్తున్నారు.
గతంలో మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజ దర్శకుల శైలిని అనుకరించి చాలామంది విఫలమయ్యారు. కానీ ఈ ఇద్దరు వెంకీల విషయంలో పరిస్థితి పూర్తి రివర్స్‌లో ఉంది. వీరు త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్‌ను ఫాలో అవ్వడమే కాకుండా.. వరుస విజయాలు సాధిస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా దూసుకెళ్తున్నారు. అయితే గురువు, శిష్యరికం విషయంలో ఈ ఇద్దరి నేపథ్యం వేర్వేరు. వెంకీ కుడుముల త్రివిక్రమ్ వద్ద `అ ఆ` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఆయన్ను గురువుగా భావిస్తే... వెంకీ అట్లూరి మాత్రం త్రివిక్రమ్ దగ్గర పనిచేయకపోయినా... ఆయనతో అనుబంధం ఉన్న హోమ్ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో వరుస సినిమాలు చేస్తూ ఆ శైలిని సొంతం చేసుకున్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి ప్రయాణాన్ని గమనిస్తే.. నటుడిగా, రచయితగా కెరీర్ ప్రారంభించి `తొలిప్రేమ`తో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వచ్చిన `సార్`, `లక్కీ భాస్కర్`.. తాజాగా సూర్యతో తీసిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రాలు అతడిలోని పరిణతిని నిరూపించాయి. `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో మానవ సంబంధాలు, కుటుంబ బంధాలను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అర్థవంతమైన సంభాషణలతో కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో సినీ విశ్లేషకులు వెంకీ అట్లూరిని నేటి జనరేషన్ త్రివిక్రమ్ అని కొనియాడుతున్నారు.
మరోవైపు వెంకీ కుడుముల తన మొదటి చిత్రం `ఛలో`తోనే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నితిన్ కథానాయకుడిగా వచ్చిన `భీష్మ` చిత్రంతో ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అంశానికి హాస్యాన్ని జోడించి క్లీన్ ఎంటర్‌టైనర్‌ను అందించారు. ఇటీవల వచ్చిన `రాబిన్‌హుడ్` చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా..దర్శకుడిగా ఆయన చూపించిన పరిణతి, టైమింగ్ ప్రశంసలు అందుకున్నాయి. అసభ్యతకు చోటు ఇవ్వకుండా కథను నడిపించడంలో గురువు త్రివిక్రమ్ పోలికలను వెంకీ కుడుముల నిలబెట్టుకుంటున్నారు. #VK04 అనే చిత్రంతో తిరిగి గ్రేట్ కంబ్యాక్ కోసం అతడు ప్రయత్నిస్తుండటం.. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించడం కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
`అత్తారింటికి దారేది`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఆడియెన్ ఫేవరెట్ గా ఎదిగితే .. ఆయననే అనుకరిస్తూ ఇప్పుడు నవతరం దర్శకులు కూడా అలాంటి క్లీన్ ఎంటర్ టైనర్లను అందించేందుకు ప్రయత్నించడం ఆసక్తిని కలిగిస్తోంది. టాలీవుడ్ లో నిరంతరం లైమ్ లైట్ లో దూసుకెళుతున్న అరడజను మంది దర్శకులలో ఈ ఇద్దరి పేర్లు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.