ఆ సినిమాలైనా త్రిష ఆశను నెరవేరుస్తాయా?
త్రిష ఏ ముహూర్తాన పొన్నియన్ సెల్వన్ సినిమా చేసిందో కానీ అప్పట్నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది.;
ప్రస్తుతం హీరోయిన్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఆ పోటీని తట్టుకుని త్రిష నాలుగు పదుల వయసులో కూడా స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. 96 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన త్రిష ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.
త్రిష ఏ ముహూర్తాన పొన్నియన్ సెల్వన్ సినిమా చేసిందో కానీ అప్పట్నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ఆ సినిమా తర్వాత త్రిషకు వరుసపెట్టి అవకాశలొచ్చాయి. అవకాశాలైతే వచ్చాయి కానీ అవేవీ త్రిష స్టార్‌డమ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లలేక పోగా, త్రిష నటించిన రీసెంట్ సినిమాలన్నీ కనీస ప్రభావాన్ని చూపించకలేక పోయాయి.
గత రెండేళ్లుగా త్రిష వరుస ఫ్లాపులను అందుకుంటుంది. లియో, ఐడెంటిటీ, విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక పోయాయన్న సంగతి తెలిసిందే. వీటిలో ఏ సినిమాలోనూ త్రిషకు తగ్గ పాత్ర దొరకలేదు. దాంతో త్రిష స్టార్‌డమ్ తగ్గుతూ వస్తుంది. పోనీ ఆమె సోలోగా చేసిన థ్రిల్లర్ మూవీ ది రోడ్ అయినా సక్సెస్ అయిందా అంటే అదీ లేదు.
ఇక రీసెంట్ గా కమల్ హాసన్ తో చేసిన థగ్ లైఫ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమా భారీ ఫ్లాపుగా నిలవడమే కాకుండా అందులో త్రిష చేసిన పాత్రపై ఎన్నో విమర్శలు తలెత్తాయి. థగ్ లైఫ్ సినిమా త్రిష నుంచి వచ్చిన ఆరో ఫ్లాపు. మధ్యలో గోట్ సినిమాలో స్పెషల్ పాత్రలో మెరిసి అందరిని ఆకట్టుకున్నప్పటికీ, హీరోయిన్ గా చేసిన సినిమాలు మాత్రం త్రిషకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో త్రిష ఇప్పుడు తన ఆశలన్నీ తాను ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న విశ్వంభర మీద, సూర్యతో చేస్తున్న సూర్య45 పైనే పెట్టుకుంది. మరి ఈ సినిమాలైనా త్రిష ఆశలను నెరవేర్చి తన వరుస ఫ్లాపులకు బ్రేక్ వేస్తాయేమో చూడాలి.