యష్ 'టాక్సిక్'.. ఆ ఒక్క సీన్ మాత్రమే ఎందుకు?

రాకింగ్ స్టార్ యష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-06-10 18:20 GMT

రాకింగ్ స్టార్ యష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రీసెంట్ గా విడుదలైన బీటీఎస్ వీడియో చూసిన తర్వాత అభిమానుల్లో కొత్త డౌట్లు మొదలయ్యాయి. మేకర్స్ ఎందుకు పదేపదే ఒకే యాక్షన్ ఎపిసోడ్‌ ను మాత్రమే చూపిస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ బీటీఎస్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో సెట్స్‌ లో ఆమె యాక్షన్ సీన్స్ ను ఎలా డిజైన్ చేస్తున్నారు? యష్‌ తో కలిసి ఎలా ప్లాన్ చేస్తున్నారు? అనే విషయాలను చూపించారు. ముఖ్యంగా ఓ చర్చ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్‌ చుట్టూనే వీడియో మొత్తం తిరగడం గమనార్హం. ఇక్కడే అభిమానుల్లో ఆసక్తితో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ అయినా, తాజాగా వచ్చిన బీటీఎస్ వీడియో అయినా దాదాపు అదే చర్చ్ ఫైట్ ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతున్నాయి. సినిమాలోని మిగతా రోల్స్, ఎమోషనల్ సీన్స్ తోపాటు కథకు సంబంధించిన కీలక విషయాలు మాత్రం సీక్రెట్ గానే ఉంచుతున్నారు టాక్సిక్ మేకర్స్. దీంతో టాక్సిక్‌ లో అసలు దాచిపెడుతున్నది ఏమిటి? అనే చర్చ మొదలైంది. మేకర్స్ బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలకు ఇప్పుడు ప్రమోషన్ స్ట్రాటజీ కీలకంగా మారింది. ఒకే యాక్షన్ ఎపిసోడ్‌ ను పదేపదే చూపించడం ద్వారా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాలని మేకర్స్ భావించి ఉండొచ్చు. ముఖ్యంగా యష్‌ ను పూర్తిగా కొత్త స్టైలిష్ అవతార్‌ లో చూపించే సీన్ అదే అయితే, దానినే హైలైట్ చేస్తూ మార్కెటింగ్ చేయడం వెనుక ప్లాన్ ఉండొచ్చని అంటున్నారు.

మరోవైపు సినిమా విడుదల తేదీపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఆ సినిమా సరైన సమయం కోసం వేచి చూస్తోందనే ప్రచారం జరుగుతోంది. పండుగల సీజన్‌ ను టార్గెట్ చేసుకుని అక్టోబర్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మూవీలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హ్యూమా ఖురేషి, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఏదేమైనా టాక్సిక్ గురించి ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ ను చూసుకుంటే.. మేకర్స్ తమ దగ్గర ఇంకా చాలా సర్ప్రైజ్‌ లు ఉన్నాయన్న సిగ్నల్స్ ఇస్తూనే, ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచుతున్నారని చెప్పాలి. అయితే ఆ చర్చ్ ఫైట్ సీక్వెన్స్ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకోవాలంటే టీజర్/ ట్రైలర్ లేదా సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News