'టాక్సిక్' టీజర్ ఇష్యూ.. సెన్సార్ చీఫ్ ఏమన్నారంటే?

యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆ టీజర్‌ లోని కొన్ని బోల్డ్ విజువల్స్ పెద్ద వివాదంగా మారాయి.;

Update: 2026-01-17 04:50 GMT

స్టార్ హీరో యశ్ ఇప్పుడు టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆ టీజర్‌ లోని కొన్ని బోల్డ్ విజువల్స్ పెద్ద వివాదంగా మారాయి. అభిమానులతో పాటు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

యాక్షన్, గ్యాంగ్‌ స్టర్ షేడ్స్‌ తో రూపొందిన టీజర్‌ లో యశ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టైలిష్ గెటప్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌ తో యశ్ మరోసారి తన స్టార్ డమ్‌ను చూపించారనే ప్రశంసలు వస్తున్నాయి. అయితే టీజర్‌ లోని ఒక సీన్ మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కాల్పుల శబ్దం వినిపిస్తుండగా, కారులో యశ్ పాత్ర ఒక యువతితో సన్నిహితంగా ఉన్నట్లు చూపించిన సీన్ అభ్యంతరకరంగా అనిపించింది.

దాన్ని కొందరు స్టోరీలో భాగమే అని మద్దతిస్తుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి విజువల్స్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. దానిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీజర్‌ లోని సన్నివేశాలు మహిళలను తప్పుగా చూపిస్తున్నాయంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మహిళా కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగింది.

టీజర్ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు)కు ఇటీవల లేఖ కూడా రాసింది. ఇంతలో టీజర్ వివాదంపై సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ఇలాంటి సమయంలో తాను ఆ ఇష్యూపై ఎలాంటి స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేనని తెలిపారు. డిజిటల్ మీడియాలో వచ్చే కంటెంట్ పై కూడా మాట్లాడారు.

"ఇలాంటి పరిస్థితుల్లో టాక్సిక్ టీజర్ వివాదంపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతా. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లలో మీరు చూసే ఎన్నో వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదు. అవి మా పరిధిలోకి రావు. ఆడియన్స్ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చూసే ప్రతి కంటెంట్ సెన్సార్ పొందిందే అన్న ఫీలింగ్ నుంచి బయటకు రావాలి" అని తెలిపారు.

"ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ అయ్యిందనే అనుకుంటారు. కానీ అవి మా వద్దకు రావు. వాటికి ఎలాంటి సర్టిఫికేషన్ మాత్రం ఉండదు" అని ప్రసూన్ జోషి తెలిపారు. మొత్తానికి టాక్సిక్ టీజర్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ గా కంటే వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. మరి చివరకు ఆ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో.. సెన్సార్ బోర్డు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి.

Tags:    

Similar News