ఒకసారి మాట్లాడి తప్పు చేశా.. అందుకే ఈసారి సైలెంట్ గా ఉన్నా!
అయితే కేరళ స్టోరీ గురించి ఆయన మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో రిలీజైన ది కేరళ స్టోరీపై కూడా టొవినో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.;
మలయాళ సినీ పరిశ్రమలో తనదైన స్టైల్‌తో ముందుకు సాగుతున్న నటుడు టొవినో థామస్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పీరియడ్ డ్రామా పల్లిచట్టాంబి ఏప్రిల్ 10న రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్ మధ్యలో వచ్చిన ఒక ప్రశ్న ఆయనను మళ్లీ వివాదాల మధ్యకు తీసుకొచ్చింది.
నా పోస్ట్ వారికి ప్రమోషన్ అయింది
హైదరాబాద్‌లో జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో టోవినోను రీసెంట్ గా రిలీజైన ది కేరళ స్టోరీ2 గురించి ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైమ్ లో తాను చేసిన పోస్ట్ కూడా ఆ సినిమాకే ప్రమోషన్ అయిందనిపించిందని, అందుకే ఈసారి పూర్తిగా ఇగ్నోర్ చేశానని చెప్పిన టొవినో, తన సైలెన్స్ వెనుక ఉన్న స్ట్రాటజీని స్పష్టంగా వెల్లడించారు. కేరళలో కూడా ఆ సినిమాను పెద్దగా ఎవరూ చూడలేదనుకుంటున్నాను అన్న ఆయన వ్యాఖ్య మరింత చర్చకు దారితీసింది.
కేరళ స్టోరీపై అసహనం వ్యక్తం
అయితే కేరళ స్టోరీ గురించి ఆయన మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో రిలీజైన ది కేరళ స్టోరీపై కూడా టొవినో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ సినిమాలో చూపించిన సన్నివేశాలపై ఆయన సందేహం వ్యక్తం చేస్తూ, మొదట 32,000 మహిళలు అని చెప్పి, తరువాత దాన్ని ముగ్గురికి తగ్గించడం ఏమి సూచిస్తోంది? కేరళలో 3.5 కోట్ల జనాభా ఉంది. మూడు ఘటనల ఆధారంగా మొత్తం రాష్ట్రాన్ని సాధారణీకరించడం సరైంది కాదు. మిస్‌ఇన్ఫర్మేషన్ చాలా ప్రమాదకరం అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీసి, ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.
టొవినో వ్యాఖ్యల్లో ఒకవైపు వివాదాస్పద అంశాలపై స్పష్టమైన అభిప్రాయం కనిపిస్తే, మరోవైపు పబ్లిక్ రియాక్షన్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన నటుడిగా కూడా ఆయన కనిపిస్తున్నారు. కాంట్రవర్సీలను నేరుగా ఎదుర్కొనే బదులు, కొన్ని సందర్భాల్లో సైలెన్స్‌ను ఎంచుకోవడం కూడా ఒక వ్యూహమనే సంకేతాన్ని ఆయన తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యా!
తన కొత్త సినిమా పల్లిచట్టాంబి గురించి మాట్లాడుతూ, ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే తనకు చాలా ఎగ్జైట్‌మెంట్ వచ్చిందని, 1957-58 కాలంలో కేరళలో జరిగిన సామాజిక రాజకీయ మార్పులు, సంస్కరణలు, వాటిపై వచ్చిన ప్రతిఘటనల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, ఇది కేవలం నేపథ్యం మాత్రమేనని, అసలు కథ పూర్తిగా కల్పితమని ఆయన స్పష్టం చేశారు. మొత్తమ్మీద ఓ వైపు తన సినిమాను ప్రమోట్ చేస్తూనే, మరోవైపు సెన్సిటివ్ అంశాలపై కూడా టొవినో స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అవసరమైనప్పుడు సైలెన్స్ ను కూడా స్ట్రాటజీని వాడే నటుడిగా వార్తల్లో నిలిచారు.