ఇంటర్వ్యూ కోసం వస్తే ముఖంపై పిష్ కొడతావా? స్టార్ హీరో ఫైరింగ్!
ప్రముఖ నటుడు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మీడియా ముందుకు వచ్చాడు. కానీ అక్కడ ఊహించని ఘటనకు అతడు షాకయ్యాడు.;
ప్రముఖ నటుడు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మీడియా ముందుకు వచ్చాడు. కానీ అక్కడ ఊహించని ఘటనకు అతడు షాకయ్యాడు. అక్కడ మైక్రో ఫోన్ లాగా కనిపించే ఒక వస్తువు అతడి ముఖంపైకి పిష్ కొట్టింది.. చివ్వున నీటిని చిమ్మింది. ఆ ఘటనకు స్టన్ అయిపోయిన స్టార్ హీరో ఆ సమయంలో ఎలా స్పందించాడో చూస్తే, ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఇది 20 ఏళ్ల నాటి త్రోబ్యాక్ ఘటనకు సంబంధించిన వీడియో.
నిజానికి సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా అలాంటి సన్నివేశంలో కోపగించుకోవడం చాలా సహజం. అయితే స్టార్ హీరో టామ్ క్రూజ్ అనవసరంగా గొడవకు దిగకుండా ఎంతో పరిణతితో వ్యవహరించాడు. ఆ జర్నలిస్టును ఎందుకు ఇలా చేశావ్? అంటూ పదే పదే ప్రశ్నించాడు. ఓవైపు ముఖంపై పడిన నీటిని తుడిచేందుకు అసిస్టెంట్ సహాయం చేస్తుంటే, ఆ సమయంలో అక్కడి నుంచి జారుకోబోయిన జర్నలిస్టు (కాదు కానీ) ను ఆపి మరీ ఎందుకు అలా చేసావు? అంటూ టామ్ పదే పదే ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాను పద్ధతిగా మీడియాకు సహకరించేందుకు వస్తే, ఇలా చేయడం రూడ్ గా ఉందని టామ్ నిలదీసే ప్రయత్నం చేసారు. ఈ ఘటన 2005లో లండన్‌లో జరిగిన `వార్ ఆఫ్ ది వరల్డ్స్` ప్రీమియర్ సందర్భంగా జరిగింది. టామ్ క్రూజ్ తన కెరీర్‌లో అత్యంత వింతైన రెడ్ కార్పెట్ క్షణం ఇది.
అభిమానులు విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, జర్నలిస్ట్ వేషంలో ఉన్న ఒక చిలిపి వ్యక్తి సాధారణ మైక్రోఫోన్ లాగా కనిపించే దానితో టామ్ వద్దకు వచ్చాడు. ఇంటర్వ్యూ మధ్యలో ఆ పరికరం ఊహించని విధంగా టామ్ క్రూజ్ ముఖంపైకి నేరుగా నీటిని చిమ్మింది. ఆ సమయంలో అతడు కోపగించుకోలేదు.. అక్కడి నుంచి వెళ్లిపోలేదు. ప్రశాంతంగా అతడిని ప్రశ్నించాడు అంతే! చివరికి ఆ చిలిపి వ్యక్తి ఉద్ధేశం అతడికి అర్థమైంది. నిజానికి ఈ స్టంట్ బ్రిటిష్ కామెడీ షోలో భాగమని ఆ తర్వాత వెల్లడైంది.. కానీ టామ్ క్రూజ్ ప్రతిస్పందన ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆరోజు ఘటన రెడ్ కార్పెట్ ఈవెంట్ లలో అరుదైన ఘటన.
సహజంగా కోపం అదుపు తప్పే సందర్భమది. దానిని సీరియస్ గా తీసుకుంటే పెద్ద గొడవ అవుతుంది. కానీ టామ్ క్రూజ్ అలా చేయలేదు. నేను పద్ధతిగా మీకోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తే అలా చేస్తావా? అంటూ.. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. అలాంటి పరిణతి ఉంది గనుకనే అతడు `మిషన్ ఇంపాజిబుల్` సిరీస్ ని దశాబ్ధాల పాటు విజయవంతంగా రన్ చేయగలిగాడు.