మేకోవర్‌తో అదరగొడుతున్న కుర్ర హీరోలు!
ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రమే పాత్రల కోసం మేకోవర్లు, ప్రత్యేక శిక్షణలు తీసుకునేవారు.
ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రమే పాత్రల కోసం మేకోవర్లు, ప్రత్యేక శిక్షణలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ యువ హీరోలు సైతం కమర్షియల్ హంగుల కంటే పాత్రల విశ్వసనీయతకే పీఠం వేస్తున్నారు. తెరపై కనిపించడం మాత్రమే కాకుండా పోషించే పాత్రల్లో జీవించడం కోసం ఎంతటి కష్టానికైనా వెనకాడటం లేదు. భారీ మార్పుల కోసం నెలల తరబడి ప్రత్యేక విద్యల్లో శిక్షణ పొందుతూ సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తున్నారు. ఈ సరికొత్త మేకోవర్ ట్రెండ్‌లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నాడు.వైవిధ్యమైన కథాంశాలతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రతిష్టాత్మక చిత్రం `స్వయంభూ` కోసం అసాధారణంగా శ్రమ పడుతున్నాడు.
పీరియాడిక్ డ్రామాలో యోధుడి పాత్రను రక్తికట్టించడం కోసం ఏకంగా వియత్నాం లో ప్రత్యేక శిక్షణ తీసుకుని రంగంలోకి దిగాడు. అక్కడ నిపుణుల సమక్షంలో కత్తిసాము (స్వోర్డ్ ఫైటింగ్) , ఆర్చరీ (విలువిద్య) వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే నిఖిల్ నిబద్ధత ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అలాగే విజయ్ దేవరకొండ సైతం తదుపరి చిత్రం కోసం సంచలన రీతిలో సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తోన్న `రణబాలి` కోసం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన యుద్ధ విద్యలను అభ్యసిస్తున్నారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీతో పాటు పురాతన యుద్ధ రీతుల్లో విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.
తెరపై యాక్షన్ సన్నివేశాలు సహజంగా, రోమాంచితంగా రావాలనే ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం విజయ్ మేకోవర్ - బాడీ లాంగ్వేజ్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి.
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ నటుడు శర్వానంద్ సైతం తమ కెరీర్‌లో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఎంచుకున్న విభిన్నమైన కథాంశాలకు తగినట్లుగా ప్రత్యేక నైపుణ్యాలను అలవర్చుకుంటున్నారు. కథా డిమాండ్ మేరకు బైక్ రేసింగ్ , సమర విద్యలు వంటి ప్రమాదకరమైన విద్యల్లో నెలల తరబడి నిరంతరాయంగా శిక్షణ పొందుతున్నారు. డూప్‌లతో మేనేజ్ చేయకుండా స్వయంగా రిస్క్ తీసుకుని కష్టపడటం ద్వారా సినిమాల్లో బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. యువ హీరోలలో కనిపిస్తోన్న సృజనాత్మక కసి తెలుగు సినిమా స్థాయిని అంతకంతకూ పెంచుతోంది.
నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకులు గ్లోబల్ కంటెంట్‌ను చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన యంగ్ హీరోలు యాక్షన్ ఎపిసోడ్స్..చారిత్రాత్మక పాత్రలను అత్యంత పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడానికి ప్రాణం పెడుతున్నారు. స్టార్ హీరోల బాటలోనే కుర్ర హీరోలు ప్రదర్శిస్తున్న అంకితభావం టాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతో ఆశాజనకంగా ఉంది. కేవలం గ్లామర్, డైలాగులకే పరిమితం కాకుండా విలువిద్యలు, గుర్రపు స్వారీలు, రేసింగ్‌లలో రాటుదేలుతూ చేస్తోన్న ప్రయోగాలు ఆయా చిత్రాలకు అతిపెద్ద అసెట్‌గా మారుతున్నాయి.