కార్మికుల సమ్మెపై ఫిలింఛాంబర్ ముఖ్య సందేశం
అయితే ఈ లేఖ అధికారికమా కాదా? అన్నది అస్పష్ఠంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ఫిలింఛాంబర్ అధికారికంగా ఒక ప్రకటనను వెలువరించింది.;
నేటి (04 ఆగస్టు) నుంచి సినీకార్మికులు షూటింగుల బంద్ కు పిలుపునిచ్చారని ఈ ఆదివారం ఫెడరేషన్ నుంచి ఒక లేఖ విస్త్రతంగా సర్క్యులేట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని మీడియా గ్రూపులకు ఈ అధికారిక లెటర్ హెడ్ వార్త వైరల్ అయింది. ఈ సోమవారం నుంచి పెద్దా, చిన్న సినిమాలతో పాటు, ఇతర సినీపరిశ్రమల నుంచి హైదరాబాద్ కి వచ్చి షూటింగులు చేసుకునే అందరికీ సమ్మె తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన నెలకొంది.
ఫెడరేషన్ లేఖపై సందేహాలు:
అయితే ఈ లేఖ అధికారికమా కాదా? అన్నది అస్పష్ఠంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ఫిలింఛాంబర్ అధికారికంగా ఒక ప్రకటనను వెలువరించింది. ఈ అధికారిక నోట్ ప్రకారం... వర్కర్స్ ఫెడరేషన్ కోరినట్లుగా వారి పక్షాన వేతనాలను పెంచుతూ ఎటువంటి లేఖలైనా జారీ చేయకూడదని ఫిలింఛాంబర్ ప్రధాన కార్యదర్శి ఎల్.దామోదర ప్రసాద్ ఒక సర్కులర్ ని జారీ చేసారు.
ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఏమన్నారు?
ఆదివారం (03-08-2025) నాడు ఫెడరేషన్ మీడియాకు విడుదల చేసిన లేఖకు సంబంధించి ఏవైనా వివరాల కోసం తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ని సంప్రదించాలని నిర్మాతలను కోరడం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు వర్కర్స్ ఫెడరేషన్ పేర్కొన్న వేతన పెంపును తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకరించలేదని అధికారికంగా ఫిలింఛాంబర్ గౌరవకార్యదర్శి దాము పేర్కొన్నారు. అన్ని నిర్మాణ సంస్థలు, నిర్మాతలు దీనిని గమనించాలని నొక్కి చెప్పడం చర్చగా మారింది.
అనుకున్నంతా అయింది:
తెలుగు ఫిలింఛాంబర్ తాజా ప్రకటనతో కార్మికుల భత్యం పెంపు ఇప్పట్లో అసాధ్యమని తేలిపోయింది. సమ్మె చేస్తామని కార్మికుల తరపున ఫెడరేషన్ లేఖ వైరల్ అవ్వడం కలకలం రేపింది. ప్రస్తుతం షూటింగులు జరుగుతున్నాయా లేదా? అనేదానిపై పూర్తి అప్ డేట్ లేదు. కార్మికులకు 30శాతం భత్యం పెంపును అమలు చేయకపోతే షూటింగులకు సహకరించడం కుదరదని ఫెడరేషన్ మాజీ కార్యదర్శి జగదీష్ రెడ్డి ప్రకటించినట్టు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. దిగువ స్థాయి కార్మికుల జీవితాలు కొన్నేళ్లుగా వేతనాల పెంపు లేక ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన అన్నారు.