ఫెడ‌రేష‌న్ వ‌ర్సెస్ ప్రొడ్యూస‌ర్స్‌ ఇష్యూ ..నో క్లారిటీ!

అయినా స‌రే కార్మికులు దిగిరాక‌పోవ‌డంతో వివాదం కాస్తా లేబ‌ర్ క‌మీష‌న్ వ‌ర‌కు వెళ్లింది. ఫెడ‌రేష‌న్‌, ప్రొడ్యూస‌ర్స్ అక్క‌డ త‌మ వాద‌న‌ని వినిపించారు.;

Update: 2026-01-09 03:50 GMT

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సినీ వ‌ర్క‌ర్స్ ప‌రిస్థితి ఎలా ఉందంటే చిన్న చేప‌ను పెద్ద చేప‌..చిన మాయ‌ను పెద్ద మాయ‌.. అది స్వాహా..ఇది స్వాహా..` అన్న‌ట్టుగా త‌యారైంది. టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్‌, ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌ మ‌ధ్య వేత‌నాల పెంపు వివాదానికి దారి తీయ‌డం.. అది చిలికి చిలికి తారా స్థాయికి చేరి సినిమాల షూటింగ్‌లు నిలిపివేసే వ‌ర‌కు వెళ్ల‌డం తెలిసిందే. భారీ బ‌డ్జెట్ సినిమాలు, ,పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్‌లో భారీ స్థాయిలో నిర్మాణం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆర్టిస్ట్‌ల రెమ్యూన‌రేష‌న్‌లు పెరిగాయి.. స్టార్ హీరోల పారితోషికాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

అయితే సినిమా నిర్మాణానికి రాత్రి ప‌గ‌లు అన‌క క‌ష్ట‌ప‌డే కార్మికుల పారితోషికాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇదే అంశాన్ని లేవ‌నెత్తిన సినీ కార్మిక సంఘాలు ఫెడ‌రేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌మ్మెకు దిగ‌డంతో గ‌త ఏడాది ఆగ‌స్టులో భారీ సినిమాల నిర్మాణంతో పాటు చిన్న సినిమాల నిర్మాణం కూడా ఆగిపోయింది. అంద‌రి రెమ్యున‌రేష‌న్‌లు పెరిగాయి కానీ మాకు మాత్రం అలాగే ఉన్నాయ‌ని కార్మికులు వాదించారు. త‌మ‌కు 30 శాతం పెంచాల‌ని డిమాండ్ చేశారు. అయితే కార్తికుల‌కు సాఫ్ట్‌వేర్ల‌ తర‌హాలో పేమెంట్‌లు ఇస్తున్నా ఇంకా పెంచాల‌ని గొంతెమ్మ‌కోరిక‌లు కోరుతున్నార‌ని నిర్మాత‌లు ఫైర్ అయ్యారు. ఇంకా తెగేదాకా లాగొద్ద‌ని హెచ్చ‌రించారు.

అయినా స‌రే కార్మికులు దిగిరాక‌పోవ‌డంతో వివాదం కాస్తా లేబ‌ర్ క‌మీష‌న్ వ‌ర‌కు వెళ్లింది. ఫెడ‌రేష‌న్‌, ప్రొడ్యూస‌ర్స్ అక్క‌డ త‌మ వాద‌న‌ని వినిపించారు. అయినా వివాదం సెటిల్ కాలేదు. ఈ నేప‌థ్యంలోనే తెలుగు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమా రంగంపై ఆస‌క్తి, అనుభ‌వం, ప్ర‌తిభ ఉన్న వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తామంటూ అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆహ్వానిస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో వివాదం మ‌రింత ముదిరింది. తెలుగు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్ర‌క‌ట‌న‌తో ఆగ్ర‌హించిన కార్మిక సంఘాలు సినిమా షూటింగ్‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో వివాదం కాస్తా తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వెళ్లింది. స‌మ‌స్య తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి దీనికి ప‌రిష్కారం చూపిస్తామ‌ని, ఓ ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించి కార్మికుల‌కు న్యాయ‌మైన వేత‌నాలు అందేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. నెల‌లు గ‌డుస్తున్నా దానికి సంబంధించిన జీఓ ఇంత వ‌ర‌కు రిలీజ్ కాక‌పోవ‌డంతో కార్మికుల ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. ఇప్ప‌టికీ ఇదే ప‌రిస్థితి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతోంది. స‌మ‌స్య తీవ్ర‌త తెలిసి కార్మిక సంఘాల‌తో ఆ మ‌ధ్య‌ చిరంజీవి కూడా మాట్లాడారు. కానీ నో యూజ్‌.

ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కార్మికులు అడుగుతున్న 30 శాతం హైక్ ఇవ్వ‌డానికి నిర్మాత‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. 5 శాతం వ‌ర‌కు పెంచుతామ‌ని చెబుతుండ‌టంతో ఇప్ప‌టికీ కార్మికుల వేత‌నాల‌పై ప్ర‌తిష్టంభ‌న అలాగే కొన‌సాగుతోంది. తాజా వివాదం కార‌ణంగా ఇండ‌స్ట్రీలో ఉన్న 14000 మంది కార్మికుల భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప‌రిస్థితిలో మార్పులు రాక‌పోతే మ‌హేష్ బాబు, జ‌క్క‌న్న‌ల వార‌ణాసి, ప‌వ‌న్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` వంటి బిగ్ ప్రాజెక్ట్స్ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం కార్మికుల వేత‌నాల డిమాండ్‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మ‌రి కార్మికుల వేత‌నాల‌పై ప్ర‌భుత్వం అయినా ముందుకొచ్చి ఈ స‌మ‌స్య‌ని ఓ కొలిక్కి తెస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News