సీఎం రేవంత్ వద్దకు టాలీవుడ్ పెద్దలు? సమస్య క్లియర్ అవుతుందా?
టాలీవుడ్ కు చెందిన పలువురు నిర్మాతలు, హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.;
టాలీవుడ్ కు చెందిన పలువురు నిర్మాతలు, హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఆ సమావేశంలో తెలంగాణలో ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద తలనొప్పిగా మారిన టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతుల అంశంపై చర్చించనున్నారని వినికిడి.
ముఖ్యంగా జీవో 120లో సవరణలు చేయాలని, ప్రతిసారి ప్రత్యేకంగా ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం. తెలంగాణలో సినిమా రిలీజ్ చేయాలంటే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతుండగా.. రేవంత్ రెడ్డితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి.. ఎప్పుడైనా స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో విడుదలయ్యే సమయంలో టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతులు బాక్సాఫీస్ వసూళ్లపై కచ్చితంగా కీలక ప్రభావం చూపిస్తాయి. కానీ ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో స్పష్టత లేదని చెప్పాలి. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ లో అంతా ఓకే అయినా, తెలంగాణలోనే ఆ పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపు ప్రక్రియ చాలా సులభంగా కొనసాగుతోంది. నిర్మాతలు దరఖాస్తు చేస్తే ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేస్తూ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇస్తోంది. దీంతో అక్కడ సినిమాలు ప్లాన్ ప్రకారమే రిలీజ్ అవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వ పెద్దల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపించడం వల్ల సమస్య అలా పెద్దదిగా మారుతోంది.
రీసెంట్ గా టికెట్ రేట్ల పెంపు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తే, వాటి ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని తెలుగు సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. ఆ కండీషన్ కు పరిశ్రమ అంగీకరిస్తే జీవో జారీ చేయవచ్చని సీఎం చెప్పారు. దీంతో అంతా ఓకే అనుకున్నారు.
కానీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూర్తిగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సినిమాలకు టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఉండవని ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో పలు భారీ సినిమాలు నష్టపోయాయి! రీసెంట్ గా రిలీజ్ అయిన ది రాజా సాబ్ విషయంలో అదే జరిగింది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.