మిగిలిన ఆ హీరోలు సైతం మారాలి
టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి తెలుగు సినిమాల సందడి మొదలైంది.
టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి తెలుగు సినిమాల సందడి మొదలైంది. సంక్రాంతికి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో చిరంజీవి తన ఇమేజ్‌ను కాస్త పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేశాడు. కమర్షియల్ మూవీ అయినప్పటికీ చిరంజీవి ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనే అనుమానం ఉండేది. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మ్యాజిక్ చేసి సినిమాను హిట్ చేసుకున్నాడు. జూన్ నెలలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ చరణ్ వంటి కమర్షియల్ హీరో పెద్ది వంటి సినిమాలో నటించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. పెద్ది సినిమాతో రామ్ చరణ్ సర్‌ప్రైజ్ చేయడంతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన ఇమేజ్‌ను పక్కన పెట్టి చరణ్ పెద్దిలో నటించాడు.
సమంత మా ఇంటి బంగారం, చరణ్ పెద్ది..
పెద్దితో పాటు అదే జూన్‌లో సమంత 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సమంత సైతం తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, చాలా కొత్తగా, పూర్తి విభిన్నంగా సినిమాలో కనిపించింది. అందుకే మా ఇంటి బంగారం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక జులై నెలలో అఖిల్ 'లెనిన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్‌ను ఇన్నాళ్లు ఒకే జోనర్‌లో చూసిన ప్రేక్షకులకు దర్శకుడు లెనిన్ ద్వారా కొత్తగా చూపించాడు. కమర్షియల్ మూవీ కాకుండా, ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీగా లెనిన్ సాగింది. అందుకే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై లవ్ స్టోరీ సైతం హీరోయిన్ సెంట్రిక్‌గా సాగింది. అందుకే ప్రేక్షకులు ఆదరించారు. తాజాగా రవితేజ ఇమేజ్‌కి పూర్తి ఆపోజిట్ ఉండే విధంగా ఇరుముడి సినిమాను రూపొందించారు. రవితేజ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇరుముడి సినిమాను ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన ఇరుముడి త్వరలో రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రవితేజ ఇరుముడి సినిమాతో...
ఇరుముడి సినిమాతో హీరోలు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మాత్రమే కాకుండా, ఇలా విభిన్నమైన సినిమాలు తీస్తే, చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని మళ్లీ నిరూపితం అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేసినప్పటి నుంచి హీరోల మైండ్ సెట్ మారింది అంటూ ఆ మధ్య దర్శకుడు శివ నిర్వాన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పటికే నానితో పాటు ఇంకా చాలా మంది హీరోలు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి, కంటెంట్ పై దృష్టి పెట్టి సినిమాలు చేస్తున్నారు. కనుక వారు మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కంటెంట్ పై నమ్మకంతో చేస్తున్న హీరోలు సైతం తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా కొంత మంది హీరోలు మాత్రం అదే మూస ధోరణిలో సినిమాలు చేస్తున్నారు. వారు ఇప్పటికైనా మారాల్సిన సమయం వచ్చిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్స్ ఇమేజ్ చట్రంలో..
సీనియర్ స్టార్స్‌లో కొందరు, యంగ్ స్టార్స్‌లో కొందరు ఇప్పటికీ తమ ఇమేజ్ అనే చట్రం నుంచి బయట పడేందుకు భయపడుతున్నారు. తమ ఇమేజ్‌కు తగ్గట్లుగా కథలు ఎంపిక చేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఎప్పుడేతై బోర్డర్ దాటుతారో అప్పుడే ఆ హీరోలు విజేతలుగా నిలుస్తారు అనే విషయం వారికి అర్థం కావడం లేదు. ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాలు మానేసి, కథకు తగ్గట్లుగా తమను తాము మలుచుకుంటూ, కథలో నటిస్తే అప్పుడు నటుడిగా మంచి పేరు రావడంతో పాటు, ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తాయి. ఇప్పటికైనా ఆ పాత చింతకాయ ఇమేజ్ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా కొత్తగా ఇరుముడి, పెద్ది, దసరా వంటి సినిమాలు చేయాలని వారి అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ఆ హీరోలు ఇకపై అయినా కొత్తదనంతో ఆలోచించి, కొత్తగా సినిమాలు చేసేందుకు ఓకే చెప్తారా అనేది చూడాలి.