మళ్లీ పాత ప‌ల్ల‌విలో న‌యా స్టార్!

ఈ క్రమంలోనే న‌రేష్ న‌టించిన `నాంది` మంచి విజయాన్ని సాధించడంతో నరేష్ ఇకపై సీరియస్ పాత్రలే చేస్తారని అందరూ భావించారు.

Update: 2026-08-25 09:57 GMT

టాలీవుడ్ కామెడీ కింగ్‌గా ఓ వెలుగు వెలిగిన అల్లరి నరేష్ తనదైన మేనరిజం, టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు. వరుస హాస్య చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచి మారుతున్న తరుణంలో తన జోనర్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారు. కేవలం నవ్వులకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనే ఉద్దేశంతో సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ బాట పట్టారు. ఈ క్రమంలోనే న‌రేష్ న‌టించిన `నాంది` మంచి విజయాన్ని సాధించడంతో నరేష్ ఇకపై సీరియస్ పాత్రలే చేస్తారని అందరూ భావించారు.

అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని యాక్షన్ .. థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రయోగాలు బాగానే ఉన్నా? నరేష్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అసలు వినోదం మిస్సవుతోందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో .. అభిమానుల్లో గట్టిగా వినిపించింది. ఈ విషయాన్ని గ్రహించిన అల్లరి నరేష్ పంథాను మార్చుకుని మళ్లీ తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రేక్షకులకు బోరు కొట్టించిన పాత ధోరణికి భిన్నంగా సరికొత్త ఫన్ .. ఎంటర్‌టైనర్ కథలతో ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగానే న‌రేష్ నటిస్తోన్న‌ తాజా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం న‌రేష్ చేతిలో `రంభా ఊర్వశి మేనక` వంటి ఫాంటసీ టచ్ ఉన్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఉంది. చంద్రమోహన్ చింతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. అనుకోని పరిస్థితుల్లో భూమి మీదకి వ‌చ్చిన‌ దేవకన్యల వల్ల హీరో పడే ఇబ్బపాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

అలాగే `సభకు నస్కారం`, `కనక దుర్గ` వంటి వినోదాత్మక చిత్రాల్లోనూ నటిస్తున్నారు. న‌రేష్ ఒక్క‌సారిగా సీరియస్ రూట్ నుంచి మళ్లీ తన మార్క్ కామెడీ బాటలోకి రావ‌డంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరేష్ మళ్ళీ పాత కామెడీ పల్లవిని అందుకుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగ‌ని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లు న‌రేష్ కు సెట్ అవ్వ‌లేదు అని కాదు. యాక్ష‌న్ పాత్ర‌ల్లో సైతం త‌న‌దైన ముద్ర వేసారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే క‌థలు రొటీన్ గా ఉండ‌టంతో అవి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌లేదు. `మ‌హ‌ర్షి`లో రైతు కొడుకు పాత్ర‌తో న‌రేష్ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఆ పాత్ర‌తో న‌రేష్ సెకెండ్ ఇన్నింగ్స్ పూర్తిగా మారిపోతుంద‌నుకున్నారు. కానీ ఆ త‌ర్వాత ఎంచుకున్న క‌థ‌లు క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో రేసులో వెనుక‌బ‌డ్డారు.

Tags:    

Similar News