ఫ్లాప్‌ల తర్వాతే అసలు స్టార్‌డమ్.. ఒక్క హిట్‌తో మారిపోతున్న స్టార్ కెరీర్లు!

టాలీవుడ్‌లో ఈ మధ్య ఓ ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. వరుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళ్లే హీరోల కంటే.. కొంతకాలం సరైన హిట్ కోసం ఎదురుచూసిన స్టార్లు ఒక్క సినిమాతో తిరిగి తమ మార్కెట్‌ను నిలబెట్టుకుంటున్నారు.

Update: 2026-08-25 10:04 GMT

టాలీవుడ్‌లో ఈ మధ్య ఓ ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. వరుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళ్లే హీరోల కంటే.. కొంతకాలం సరైన హిట్ కోసం ఎదురుచూసిన స్టార్లు ఒక్క సినిమాతో తిరిగి తమ మార్కెట్‌ను నిలబెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఫ్లాప్‌లతో వచ్చిన నెగెటివ్ టాక్, సోషల్ మీడియా ట్రోలింగ్, మార్కెట్‌పై పడిన ఒత్తిడి.. ఇవన్నీ ఒక స్ట్రాంగ్ స‌క్సెస్ తర్వాత చాలా వరకు కనుమరుగవుతున్నాయి. దీంతో కమ్‌బ్యాక్ మూవీ అనేది ఇప్పుడు కేవలం ఒక సినిమాగా కాకుండా.. ఓ స్టార్ కెరీర్‌లో కీలకమైన మలుపుగా మారుతోంది.

ఇటీవల రామ్ చరణ్ నుంచి మొదలైన ఈ బౌన్స్‌బ్యాక్ డిస్క‌ష‌న్ ఇప్పుడు రవితేజ వరకు కొనసాగుతోంది. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్‌కు స‌క్సెస్ లేదు. కానీ పెద్ది స‌క్సెస్ చ‌ర‌ణ్ కు ఎంతో అవసరమైన టైమ్ లో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అఖిల్‌కు కూడా కెరీర్‌లో ఎదురుచూసిన కమర్షియల్ ఐడెంటిటీను లెనిన్ అందించింది. సమంతకు మా ఇంటి బంగారం స‌క్సెస్ వరుస ఫ్లాపుల తర్వాత మళ్లీ తన మార్కెట్‌పై నమ్మకం పెంచుకునే అవకాశం ఇచ్చింది. వరుణ్ తేజ్‌కు కొరియన్ కనకరాజు సక్సెస్ కూడా ఇదే తరహాలో కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు రవితేజకు ఇరుముడి సినిమా అదే పాత్ర పోషిస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక‌టుంది. హిట్ అంటే కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు కాదు. ఒక సినిమా స‌క్సెస్ హీరో మార్కెట్‌ను తిరిగి యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. నిర్మాతలకు త‌ర్వాతి ప్రాజెక్టులపై ధైర్యం పెంచుతుంది. డిస్ట్రిబ్యూటర్లలో నమ్మకాన్ని తీసుకొస్తుంది. ఫ్యాన్స్ లో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా వరుస ఫ్లాపుల తర్వాత ఈ స్టార్ మార్కెట్ ఎలా ఉంటుంద‌నే సందేహానికి ఒక్క సక్సెస్ బలమైన సమాధానంగా మారుతుంది.

అదే సమయంలో ఆడియ‌న్స్ మెమొరీ కూడా ఈ కమ్‌బ్యాక్‌లకు కీలకంగా మారుతోంది. గతంలో చేసిన ఫ్లాపులను ఎక్కువకాలం గుర్తుపెట్టుకునే పరిస్థితి తగ్గింది. మంచి సినిమా వస్తే గత వైఫల్యాలను పక్కన పెట్టి అదే స్టార్‌ను మళ్లీ ఆదరించే మైండ్‌సెట్ పెరిగింది. సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. ఒక హిట్ తర్వాత పాజిటివ్ బజ్ కూడా అంతే వేగంగా తిరిగి వస్తోంది. అందుకే ప్రస్తుతం టాలీవుడ్‌లో కమ్‌బ్యాక్ మూవీకి స్పెష‌ల్ వాల్యూ ఏర్పడుతోంది. సినిమా హిట్ కావడం ఒక విషయం అయితే.. ఆ హిట్‌తో ఒక స్టార్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడం మరో విషయం. చరణ్ నుంచి రవితేజ వరకు కనిపిస్తున్న ఈ బౌన్స్‌బ్యాక్ ట్రెండ్.. రాబోయే రోజుల్లో మరెంతమంది స్టార్లకు కొత్త ఊపిరి ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News