2025..తెలుగు సినిమాకు వార్నింగ్ బెల్స్!
గత ఏడాది వరకు టాలీవుడ్ మేకర్స్, స్టార్స్ చేసిన పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాప్‌లో నిలిచాయి.;
గత ఏడాది వరకు టాలీవుడ్ మేకర్స్, స్టార్స్ చేసిన పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాప్‌లో నిలిచాయి. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ మేకర్స్, స్టార్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. అయితే 2025కి వచ్చే సరికి పరిస్థితి చాలా వరకు మారిపోయింది. టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సందడి చేయాలని చూశాయే కానీ ఆశించి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అదే టైమ్‌లో బాలీవుడ్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకోవడం మొదలు పెట్టింది.
అక్కడ కంటెంట్‌ను నమ్ముకుని చేసిన భారీ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించి బాలీవుడ్ లో సరికొత్త ఆశల్ని రేకెత్తించాయి. రష్మిక మందన్న `థామా`, యష్ రాజ్ ఫిలింస్ `సయారా, విక్కీకౌశల్ `ఛావా`, రణ్‌వీర్ సింగ్ `ధురంధర్` సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇప్పటికీ `ధురంధర్` బాక్సాఫీస్ వంద స్టడీగా రన్నవుతూ అన్ బటబుల్ రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తూ రూ.1000 కోట్ల దిశగా పయనిస్తోంది.
అయితే తెలుగు సినిమా మాత్రం ప్యాన్ ఇండియా మోజులో నేలవిడిచి సాము చేస్తూ డీలా పడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాల్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` మూవీ తప్ప మరేదీ ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్‌లలో చోటు దక్కించుకోలేకపోయిందంటే 2025లో తెలుగు సినిమా పరిస్థితి ఏలా మారిందో స్పష్టమవుతోంది. గత ఏడాది `పుష్ప 2`తో అల్లు అర్జున్, `కల్కీ 2898ఏడీ`తో ప్రభాస్ సందడి చేస్తే ఈ ఏడాది వారి సినిమాలు రాకపోవడం వారి లోటుని గుర్తు చేసింది.
ఇక ఈ ఏడాది బిగ్ స్టార్స్‌ని నమ్ముకుని చేసిన పాన్ ఇండియా మూవీస్ గేమ్ ఛేంజర్, హరి హర వీరమల్లు, కింగ్‌డమ్, కుబేర సినిమాలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేక తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈ సినిమాలతో టాలీవుడ్ భారీ నష్టాలని చవిచూడాల్సి వచ్చింది. ఇదే టైమ్‌లో కంటెంట్ నే బలంగా నమ్ముకుని చేసిన `కోర్ట్`, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, `లిటిల్ హార్ట్స్`, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి మేకర్స్‌కి కోట్లల్లో లాభాల్ని తెచ్చి పెట్టాయి.
ఇక ఈ ఏడాది ఎండింగ్‌లో విడుదలైన `ఆంధ్రా కింగ్`, `అఖండ 2` టాక్‌కు కలెక్షన్స్‌కి సంబంధం లేకుండా టాక్‌ని సొంతం చేసుకుని ఫ్లాప్‌లుగా నిలిచి టాలీవుడ్‌కు వార్నింగ్ బెల్స్ మోగించాయి. పాన్ ఇండియా పేరుతో స్టార్స్ వెంట పరుగులు పెట్టడం మాని కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలతో అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేసింది. కంటెంట్ ప్రధానంగా రూపొందించిన చిన్న సినిమాలు పెట్టిన బడ్జెట్‌కు మూడు రెట్లు లాభాల్ని తెచ్చి పెట్టి ఇకనైనా టాలీవుడ్ మేకర్స్ పాన్ ఇండియా పేరుతో నేల విడిచి సాము చేయకుండా కథాబలమున్న సినిమాలపై దృష్టిపెట్టాలని హెచ్చరించింది.