ఒంటరితనంలోని సుఖం: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల డైలమా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొందరు అగ్ర హీరోల పెళ్లి విషయం నిరంతరం చర్చనీయాంశంగా మారుతోంది.;

Update: 2026-04-17 22:30 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొందరు అగ్ర హీరోల పెళ్లి విషయం నిరంతరం చర్చనీయాంశంగా మారుతోంది. వయసు పెరుగుతున్నా.. కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నా.. వివాహ బంధం వైపు అడుగులు వేయడానికి మాత్రం వారు విముఖత చూపుతున్నారు. ఒకరు 45 ఏళ్ల మార్కును దాటినా.. మరొకరు 35 ఏళ్ల పైబడిన వయసులో ఉన్నా.. ఇప్పటికీ `సోలో లైఫే సో బెటర్` అంటూ బ్యాచిలర్ జీవితాన్ని ఆస్వాధించడం అభిమానులను ఆశ్చర్యాన్ని క‌లిగిస్తుండ‌గా త‌ల్లిదండ్రులు బంధు మిత్రుల‌ను మాత్రం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ క్రమంలో ``ఒంటరిగా ఉండటంలో ఉన్న సుఖం మరెందులోనూ లేదు`` అనే ధోరణిలో వారు ఉండటం చర్చకు దారితీస్తోంది.

ఈ స్టార్ హీరోల కుటుంబ సభ్యులు మాత్రం వారి వివాహం గురించి తీవ్రంగా బెంగ పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్లు ఎంతగా పోరుతున్నా, సంబంధాలు చూస్తున్నా ఈ బ్యాచిలర్లు మాత్రం ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు పెళ్లి అంటే ఇరవైలలోనే జరిగిపోయేది.. కానీ నేటితరం నటులు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు, కెరీర్ ఎదుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల వివాహం అనేది జాబితాలో చివరి అంకానికి చేరుతోంది. అయితే సంప్రదాయ కుటుంబ విలువలను నమ్మే పెద్దలు మాత్రం సరైన సమయంలో పెళ్లి జరగకపోతే వంశాభివృద్ధికి.. కుటుంబ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు.

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. వయసు ముదిరిన తర్వాత వివాహం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య , మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సంతానలేమి వంటి సమస్యలు లేదా భాగస్వామితో సర్దుబాటు చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు ఎన్ని ఉన్నా సమయానికి జరగాల్సిన ముచ్చట జరగకపోతే ఆ తర్వాత వచ్చే ఫలితాలు ఆగమ్యగోచరంగా మారుతాయని పెద్దలు హెచ్చరిస్తుంటారు. కేవలం కెరీర్ లోని బిజీ వల్లనో లేదా ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవడం వల్లనో పెళ్లిని వాయిదా వేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభిమానుల కోణం నుండి చూస్తే.. తమ అభిమాన హీరోలు ఓ ఇంటివారై.. ముద్దులొలికే పిల్లలతో సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ దేశవ్యాప్తంగా జోరెక్కిన‌ తరుణంలో ఈ ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చి శుభవార్త చెబితే బాగుంటుందని ఆశిస్తున్నారు. వెండితెరపై ప్రేమకథలతో మెప్పించే వీరు నిజ జీవితంలో కూడా ఒక తోడును వెతుక్కుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు నిరంత‌రం వెల్లువెత్తుతున్నాయి.

వివాహం అనేది వ్యక్తిగత నిర్ణయం అయినా కానీ.. సామాజిక క‌ట్టుబాట్లు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా సరైన వయసులో ఆ దిశ‌గా అడుగులు వేయడం అవసరమ‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నటుడు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించగలిగినట్టే జీవితంలోని గృహస్థాశ్రమం అనే కీలక పాత్రను కూడా పోషించి నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు బ్యాచిలర్ హీరోలు అన్నిర‌కాల‌ డైలమాలు వీడి.. పెళ్లి పీటలు ఎక్కడం ద్వారా అటు కుటుంబ సభ్యులకు.. ఇటు అభిమానులకు తీపి కబురు అందిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News