మిడ్-రేంజ్ హీరోల వైవిధ్యమైన ప్రయోగాలు!
టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా హీరోలు కూడా ఆలోచనా విధానాన్ని మారుస్తున్నారు
టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా హీరోలు కూడా ఆలోచనా విధానాన్ని మారుస్తున్నారు. ఒకప్పుడు కమర్షియల్ మాస్ ఫార్ములా సినిమాలకే పరిమితమైన మిడ్-రేంజ్ హీరోలు ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేసారు. రొటీన్ కథలకు స్వస్తి పలికి.. సరికొత్త జోనర్స్, వైవిధ్యమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలతో ప్రయోగానికి పెద్దపీట వేస్తున్నారు. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు ఈ ట్రెండ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ టాలీవుడ్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
నేచురల్ స్టార్ నాని కెరీర్ మొదటి నుంచి వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. `జెర్సీ`, `శ్యామ్ సింగరాయ్`, `దసరా`, `హాయ్ నాన్న వంటి సినిమాలతో డిఫరెంట్ జోనర్లను టచ్ చేసి వర్సటైలిటిని నిరూపించుకున్నారు. ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా ప్రతి చిత్రంలోనూ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్‌ను మారుస్తూ ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతిని పంచుతున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా తన మార్క్ మాస్ సినిమాలతో పాటు, విభిన్న కథాంశాలు, ప్రయోగాత్మక త్రిల్లర్స్ వైపు అడుగులు వేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కూడా రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రా మాస్, ఎమోషనల్ యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. విజయ్ ఎంచుకునే కథల్లో విభిన్నమైన సామాజిక కోణాలు, సరికొత్త భావోద్వేగాలు ఉంటున్నాయి. మరోవైపు మెగా హీరో సాయిధరం తేజ్ కూడా ఫార్ములా కమర్షియల్ బాట వీడి `విరూపాక్ష` వంటి సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలాంటి విభిన్న కథాంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ హీరోల కెరీర్‌కు ప్లస్ అవుతున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రయోగాల విషయంలో ఎప్పుడూ ముందుంటారు. స్పేస్ థ్రిల్లర్ `అంతరిక్షం` నుంచి స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్స్ , పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ కథల వరకు ఆయన చేసే ప్రయోగాలు పరిశ్రమలో చర్చనీయాంశమవుతున్నాయి. ఒకే తరహా పాత్రలలో ఇమిడిపోకుండా ప్రతి సినిమాలోనూ సరికొత్త గెటప్, డిఫరెంట్ యాటిట్యూడ్‌తో కనిపించాలనే తపన మిడ్-రేంజ్ హీరోలందరిలో కనిపిస్తోంది. ఇది వారి మార్కెట్‌ను విస్తరిం చడమే కాకుండా తెలుగు సినిమా పరిధిని మరింత పెంచుతోంది.
ప్రేక్షకుల అభిరుచి మారుతున్న తరుణంలో హీరో ఎంట్రీ సాంగ్స్, ఫైట్ల కంటే బలమైన కంటెంట్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓటీటీల ఎంట్రీతో గ్లోబల్ ఆడియెన్స్ స్థాయికి ప్రేక్షకుల ఆలోచనా విధానం విస్తరించింది. దీంతో మిడ్-రేంజ్ హీరోలు చేస్తున్న ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే? చిన్న పెద్ద అనే తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని హీరోలు మరింత ధైర్యంగా కొత్త కథలను ఎంచుకుంటున్నారు.
అంతిమంగా మిడ్-రేంజ్ హీరోల ప్రయోగాల ధోరణి టాలీవుడ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందన్నది కాదనలేని నిజం. రొటీన్ కమర్షియల్ హంగులను పక్కన పెట్టి సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్న హీరోల సాహసం పరిశ్రమలో సరికొత్త వైభవాన్ని తెచ్చిపెడుతోంది. భవిష్యత్ లో మరిన్ని వినూత్న ప్రయోగాలు, డిఫరెంట్ జోనర్లతో హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయం.