సూర్య సేవ వెనక.. ఆ ఐదు రూపాయల బాధ!

వెండితెరపై స్టార్ గా ఎంత బిజీగా ఉన్నా, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు కోలీవుడ్ స్టార్ సూర్య.

Update: 2026-10-14 03:39 GMT

వెండితెరపై స్టార్ గా ఎంత బిజీగా ఉన్నా, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు కోలీవుడ్ స్టార్ సూర్య. ముఖ్యంగా 'అగరం ఫౌండేషన్' ద్వారా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఆయన అందిస్తున్న చేయూత అందరికీ తెలిసిందే. అయితే ఈ సేవా కార్యక్రమాలు సూర్యతోనే అకస్మాత్తుగా మొదలు కాలేదు. దీని వెనుక ఆయన తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ప్రారంభించిన దాదాపు ఐదు దశాబ్దాల ప్రణాళిక ఉంది.

ఈ సేవా దృక్పథం వెనుక తన చిన్ననాటి చేదు అనుభవమే కారణమని శివకుమార్ స్వయంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన రెండో తరగతి ఫీజు రెండు రూపాయలు, అక్క మూడో తరగతి ఫీజు మూడు రూపాయలు ఉండేదని.. నెలకు కేవలం ఆ ఐదు రూపాయలు కట్టలేని నిస్సహాయ స్థితిలో తన అక్క చదువును ఆపేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. చదువుకోవాలనే ఆశ ఉన్నా డబ్బు లేక ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ వయసులోనే చూశానని, అదే తన జీవితంలో ఇలాంటి ఆలోచనకు పునాది వేసిందని ఆయన చెప్పారు.

ఆ అనుభవంతోనే 1979లో తన వందో చిత్రం 'రోసాప్పూ రవిక్కైక్కారి' ద్వారా వచ్చిన మొత్తం పారితోషికం రూ.25 వేలను విద్యార్థుల చదువుల కోసమే కేటాయించారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఏటా ఆర్థిక సాయం అందించడం మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన 'శివకుమార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' 47 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం.

తండ్రి అడుగుజాడల్లో నడిచిన సూర్య, 2006లో 'అగరం ఫౌండేషన్' స్థాపించి ఆ సేవను మరింత విస్తరించారు. కేవలం మార్కులు మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఫస్ట్ జనరేషన్ కాలేజీ విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఇప్పటివరకు దాదాపు 6,500 మందికి పైగా ఉన్నత విద్యను అందించగా, అందులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలే ఉన్నారు.

అగరం ఫౌండేషన్ పనితీరు కాలేజ్ ఫీజులు కట్టడంతోనే ఆగిపోదు. హాస్టల్, భోజనం, కెరీర్ గైడెన్స్ ఇస్తూ చదువు పూర్తయ్యే వరకు తోడుగా ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఒకప్పుడు అగరం సాయంతో చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులే, ఇప్పుడు కొత్తగా చేరే వారికి మెంటార్లుగా మారి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా ఒక తరం నుంచి మరో తరానికి సహాయం అందేలా ఒక వ్యవస్థను నిర్మించారు.

ఇటీవల జరిగిన 47వ వార్షికోత్సవంలోనూ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ, రీల్స్ మాయలో పడకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూర్య ప్రాక్టికల్ గా మాట్లాడారు. సినీ రంగంలో చాలా సందర్భాల్లో సేవా కార్యక్రమాలు తాత్కాలిక ప్రచారం కోసమో లేదా సినిమా రిలీజ్ హడావుడి కోసమో జరుగుతుంటాయి. కానీ రెండు తరాలుగా, నాటి ఆ ఐదు రూపాయల కష్టాన్ని మర్చిపోకుండా కొనసాగించడం నిజంగా అరుదైన విషయమే.

Tags:    

Similar News