ఎల్నినోపై CM రేవంత్ రెడ్డి హెచ్చరికను గుర్తుచేసిన దేవరకొండ
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి `సూపర్ ఎల్ నినో` ప్రభావం గురించి చెబుతూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన విషయాన్ని విజయ్ దేవరకొండ ఈ వేదికపై గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఎల్.నినో ప్రభావంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరో ఏడాది పాటు తీవ్ర కరువు పరిస్థితులు ఉండే అవకాశముందని.. నీటి ఎద్దడితో పాటు ప్రజలు పలు సహజ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. పంటలు సరిగా పండని ఈ కష్టకాలంలో లభ్యమయ్యే వనరులను పొదుపుగా వాడుకుంటూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్-ఇండియా చిత్రం `రణబాలి` విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న కథానాయకుడు విజయ్ దేవరకొండ, వాతావరణ సమస్యలు .. ఎల్.నినో ప్రభావంపై చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవిగా నిలిచాయి.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి `సూపర్ ఎల్ నినో` ప్రభావం గురించి చెబుతూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన విషయాన్ని విజయ్ దేవరకొండ ఈ వేదికపై గుర్తుచేశారు. సరిగ్గా 150 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ ఎల్ నినో వల్ల `గ్రేట్ మద్రాస్ ఫామైన్` సంభవించిందని.. అప్పట్లో బ్రిటిష్ పాలకులు చేసిన ఘోరాల కారణంగా దాదాపు 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అలాంటి ఎల్ నినో సైకిల్ రిపీట్ అవుతున్న నేపథ్యంలో.. మన పూర్వీకులు పడిన బాధలు మనం పడకూడదంటే నీరు, కరెంట్, ఆహారాన్ని వృథా చేయకుండా ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. సీఎంగారు చెప్పారు అంటే అది చాలా తీవ్రమైన విషయమని.. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూనే... ఎన్ని కష్టాలు ఎదురైనా ముందడుగు వేసే ధైర్యం భారతీయుల్లో ఉందన్నారు.
ఇదే వేదికపై విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితంలో... సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న వైఫల్యాల సమయాన్ని కూడా నెమరువేసుకున్నారు. గతంలో నా `నోటా` సినిమా సరిగ్గా ఆడనప్పుడు నేను మళ్లీ పుంజుకుంటానని ఒక లేఖ రాశాను. ఆ తర్వాత వచ్చిన `టాక్సీవాలా`ను ఎంతో ఎంజాయ్ చేస్తూ తీశాం.. దానికి మంచి విజయం దక్కింది. ఇప్పుడు రాహుల్ `రణబాలి` రూపంలో నాకు అలాంటి మరో గొప్ప వేదికను ఇవ్వబోతున్నాడు. మన మీద మనకు నమ్మకం ఉండటం... చేసే పనిలో ప్రాణం పెట్టి కష్టపడటం అనే ఈ రెండే మన చేతుల్లో ఉంటాయి అని స్పష్టం చేశారు. అలాగే తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంలో మైత్రీ మూవీ మేకర్స్ పాత్ర కీలకంగా నిలిచిందని ప్రశంసించారు.
`రణబాలి` చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినాన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు.