మట్టి, గడ్డం, లుంగీ.. టాలీవుడ్ కు పట్టిన రస్టిక్ రోత!

Update: 2026-10-14 03:38 GMT

పుష్ప, కేజీఎఫ్ లాంటి భారీ విజయాలు టాలీవుడ్ లో ఒక కొత్త గాలిని తెచ్చాయి. ఏ హీరో చూసినా ఒంటికి బొగ్గు, మట్టి పూసుకోవడం, జులపాల జుట్టు పెంచడం, చేతిలో ఒక రెగ్యులర్ గా వాడే వస్తువును ఆయుధంగా పట్టుకోవడం కామన్ అయ్యింది. ఒకప్పుడు స్టైలిష్ గా కనిపించిన టైర్ 2 హీరోలు కూడా ఇప్పుడు బలవంతంగా డీగ్లామర్ అవతారాలు ఎత్తుతున్నారు. నేచురాలిటీ పేరుతో ప్రతి ప్రాజెక్ట్ లోనూ అదే డస్ట్, అదే బూజు కనిపిస్తోంది.

దీనివల్ల తెలుగు సినిమాకు దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన క్లాస్, అర్బన్ డ్రామాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఒక బొమ్మరిల్లు, ఆనంద్, నువ్వే కావాలి లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీలు కానీ, యూత్ కనెక్ట్ అయ్యే స్టైలిష్ అర్బన్ కథలు కానీ ఇప్పుడు ఏడాదికి ఒకటి వెతికినా కనిపించడం లేదు. హీరో అంటే ఐటీ ఎంప్లాయ్ అనో, కాలేజ్ కుర్రాడనో చూపించడానికి దర్శకులు భయపడే పరిస్థితి వచ్చేసింది.

క్లాస్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న మన ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా మట్టి చుట్టూనే తిరుగుతోంది. ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం పాన్ ఇండియా భ్రమ. నార్త్ ఆడియన్స్ కు రా అండ్ రస్టిక్ నేటివిటీ మాత్రమే ఎక్కుతుందనే ఒక గుడ్డి నమ్మకంలో మేకర్స్ పడిపోయారు. కార్పొరేట్ సెటప్, సిటీ కల్చర్ చూపిస్తే ఇతర భాషల్లో అమ్ముడుపోదనే భయంతో అందరూ పల్లెటూళ్లు, అడవులు, మైనింగ్ బ్యాక్ డ్రాప్ ల వైపే పరుగులు తీస్తున్నారు.

కథలో దమ్ము ఉన్నా లేకపోయినా, విజువల్స్ డార్క్ గా ఉంటే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిపోతుందనే అపోహ రోజురోజుకూ పెరిగిపోతోంది. హీరోల వైపు నుంచి చూస్తే మాస్ ఇమేజ్ కోసం విపరీతమైన ఆరాటం కనిపిస్తోంది. క్లాస్ కథలు చేస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రావని, కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను నమ్ముకుంటే కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లలేమని ఫిక్స్ అయిపోతున్నారు.

కనీసం రెండు హిట్లు పడగానే ప్రతి కుర్ర హీరో కూడా తనను తాను మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే తొందరపాటులో ఇలాంటి రా క్యారెక్టర్లనే ఎంచుకుంటున్నాడు. ఆ తొందరపాటే చాలామంది కెరీర్లను తలకిందులు చేస్తోంది. అయితే అతిగా ఏది చూపించినా ప్రేక్షకులకు విరక్తి కలగడం చాలా సహజం. మొదట్లో ఈ నేల విడిచి సాము చేయని క్యారెక్టర్లు కొత్తగా అనిపించినా, ఇప్పుడు ప్రతి శుక్రవారం అదే రక్తం, అవే నల్లటి ముఖాలు చూసి జనాలు తీవ్రంగా బోర్ ఫీలవుతున్నారు.

డార్క్ మూడ్ లో సాగే సీన్లు, అరపులతో థియేటర్ లో కూర్చోవడం ఒక టాస్క్ లాగా మారిపోయింది. ఒకే ఫార్ములాను పదే పదే నమిలితే బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ ఎలా తిప్పికొడతారో రీసెంట్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కథ డిమాండ్ చేసినప్పుడు రస్టిక్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటే తప్పులేదు కానీ, ట్రెండ్ నడుస్తోందని గుడ్డిగా దూకితే ఫలితాలు దారుణంగా ఉంటాయి. సినిమా పరిశ్రమ నిలబడాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వైవిధ్యమైన జానర్లు స్క్రీన్ పైకి రావాలి. మట్టి కొట్టుకుంటేనే కలెక్షన్లు వస్తాయనే భ్రమ నుంచి ఇండస్ట్రీ ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News