డిజిటల్ మార్కెట్‌పై టాలీవుడ్ హీరోల దృష్టి!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు వెండితెరకే పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు.;

Update: 2026-04-24 00:30 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు వెండితెరకే పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్‌లే కాకుండా, విభిన్నమైన కంటెంట్ తో గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి యంగ్ హీరోలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు థియేటర్లలో భారీ సినిమాలతో సందడి చేస్తూనే మ‌రోవైపు ఓటిటిలో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో మార్కెట్‌ను విస్తరించు కుంటున్నారు. డిజిటల్ బాటలో ముందు వరుసలో ఉన్న హీరోల్లో నాగచైతన్య ఒకరు.`దూత` వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన చై నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఆ సిరీస్ సాధించిన విజయంతో `దూత 2` కోసం రెడీ అవుతున్నాడు. థ్రిల్లర్ జోనర్‌లో సాగే ఈ సిరీస్ చైతన్య కెరీర్‌లో ప్రత్యేక మైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఓటీటీ వల్ల నటులకు తమలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకునే స్వేచ్ఛ దొరుకుతోందని చై ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాగే రానా దగ్గుబాటి, సిద్దు జొన్నలగడ్డ డిజిటల్ కంటెంట్‌పై పట్టున్న వారే. రానా ఇప్పటికే `రానా నాయుడు` వంటి సిరీస్‌లతో జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్నాడు. `డీజేటిల్లు` ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కూడా తనదైన శైలిలో డిజిటల్ ప్రేక్షకులను అల రించేందుకు కథలను సిద్ధం చేసుకుంటున్నాడు. త‌న‌ని తానే స్టార్ గా మ‌లుచుకోవ‌డం కోసం రైట‌ర్ గానూ అవ‌తారం ఎత్త‌డం అత‌డికే చెల్లింది.

నేటి సిద్దు స‌క్స‌స్ కి కూడా ఆ క్వాలిటీనే కార‌ణం అన్న‌ది కాద‌న‌లేని నిజం. కిరణ్ అబ్బవరం వంటి యంగ్ హీరోలు కూడా వెబ్ ప్రపం చంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతుండటం విశేషం. ఈ క్రమంలో సుధీర్ బాబు డిజిటల్ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `గల్లీ` అనే వెబ్ సిరీస్‌తో ఆయన ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. సుధీర్ బాబు ఫిట్‌నెస్‌కు, నటనకు తగినట్లుగా పవర్‌ఫుల్ పాత్రతో ఈ సిరీస్‌లో కనిపించబోతున్నాడ‌ని సమాచారం. ప్రవీణ్ సత్తారు మార్క్ టేకింగ్, సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ తోడైతే `గల్లీ` మంచి ఫ‌లితాలు సాధిస్తుంది.

సినిమా షూటింగ్స్ మధ్యలో ఉండే విరామాన్ని యంగ్ హీరోలు ఇలాంటి వెబ్ సిరీస్‌ల కోసం కేటాయిస్తున్నారు. సినిమాల్లో ఉండే పరిమితులు ఓటిటిలో ఉండకపోవడంతో కథా బలం ఉన్న కంటెంట్‌కు హీరోలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నటులకు ఆదాయంతో పాటు నిరంతరం ప్రేక్షకులకు దగ్గరగా ఉండే అవకాశం లభిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సిరీస్‌లు డబ్బింగ్ అవుతుండటంతో పాన్ ఇండియా గుర్తింపు లభిస్తోంది. టాలీవుడ్ హీరోల డిజిటల్ ఎంట్రీ అనేది సినిమా పరిశ్రమలో ఆరోగ్యకరమైన మార్పుకు దారితీస్తోంది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే భారీ సినిమాలతో పాటు గృహ వినోదాన్ని పంచే వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టడం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని క్రేజీ కాంబినేషన్లు ఓటిటి తెరపై మెరిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News