డార్క్ హీరోయిజం ట్రెండ్ ఆ ముగ్గురితో పీక్స్!
| టాలీవుడ్ స్టార్ హీరోలు నెగెటివ్, గ్రే షేడ్స్ పాత్రలతో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్ ‘స్పిరిట్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీచంద్ సూర్య సినిమాలో విలన్‌గా నటిస్తుండగా, నాని ‘ది ప్యారడైజ్’, అడివి శేష్ ‘డెకాయిట్’లో గ్రే షేడ్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో డార్క్ హీరోయిజం ట్రెండ్ పెరుగుతోంది.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అంటే కేవలం ఆదర్శవంతమైన.. మచ్చలేని శ్రీరామచంద్రుడి పాత్రల్లోనే కనిపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. దశాబ్ధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. భారతీయ సినిమా వందేళ్లు పైబడిన చరిత్రలో ప్రేక్షకుల అభిరుచులు చాలా మారాయి. అందుకు తగ్గట్టుగా మన అగ్ర హీరోలు కూడా తమ ఇమేజ్ చట్రాలను బ్రేక్ చేస్తూ ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం భారతీయ సినిమాలో నెగెటివ్ షేడ్స్, గ్రే క్యారెక్టర్లు పోషించడం ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `స్పిరిట్` చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే.. అందులో బలమైన గ్రే షేడ్స్ తో ఆసక్తిని పెంచుతారట. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్` చిత్రంలో పూర్తిస్థాయి డార్క్ - నెగెటివ్ షేడ్స్ ఉన్న మాస్ పాత్రలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. అతడు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `రాకా`లో ఏకంగా త్రిపాత్రాభినయం (ట్రిపుల్ రోల్) చేస్తుండగా.. అందులో ఒక పాత్ర పూర్తిగా నెగెటివ్- గ్రే షేడ్స్‌తో సాగనుందని సమాచారం. అయితే ఇంకా టీమ్ అధికారికంగా దీనిని ధృవీకరించలేదు. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయాల్సిన భారీ ప్రాజెక్ట్‌లోనూ అతడి పాత్రకు బలమైన నెగెటివ్ టచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా వరుసగా రెండు భారీ చిత్రాల్లో విభిన్నమైన గ్రే షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ బన్నీ తన నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు.
మరోవైపు యాక్షన్ హీరో గోపీచంద్ మళ్ళీ తన పాత రూట్‌లోకి వెళ్తూ విలన్ అవతారం ఎత్తడం విశేషం. కెరీర్ ఆరంభంలో జయం, నిజం, వర్షం వంటి చిత్రాల్లో క్రూరమైన విలన్‌గా మెప్పించిన గోపీచంద్.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. హీరోగా కొనసాగుతూనే.. పొరుగు భాషా స్టార్ హీరో సినిమాలో పూర్తిస్థాయి విలన్ పాత్రను అంగీకరించడం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గోపీచంద్ లాంటి కటౌట్ విలన్‌గా కనిపిస్తే స్క్రీన్‌పై ఆ ఇంపాక్ట్ వేరే లెవల్‌లో ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇక నేచురల్ స్టార్ నాని- అడివి శేష్ సైతం తమ కంఫర్ట్ జోన్ దాటి గ్రే షేడెడ్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ది ప్యారడైజ్` చిత్రంలో నాని పాత్ర ఎంతో రా అండ్ రస్టిక్‌గా..గ్రే షేడ్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా విభిన్నమైన కథలను ఎంచుకునే అడివి శేష్ `డెకాయిట్` సినిమాలో ఒక దోపిడీ దొంగగా గ్రే షేడ్ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్నారు. సాధారణ హీరోయిజం కంటే ఇలాంటి ఠిఫికల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకే నేటి తరం ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుండటంతో హీరోలు సైతం వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.
నేటి ట్రెండ్ లో టాలీవుడ్‌లో హీరో-విలన్ మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతోంది. కథాబలం- పాత్రలో కొత్తదనం ఉంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి తాము సిద్ధమేనని మన స్టార్ హీరోలు నిరూపిస్తున్నారు. ప్రభాస్ `స్పిరిట్`, ఎన్టీఆర్ `డ్రాగన్`, అల్లు అర్జున్ `రాకా` వంటి చిత్రాలు విడుదలైతే.. బాక్సాఫీస్ వద్ద ఈ `డార్క్ హీరోయిజం` ట్రెండ్ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.