పరభాషా హీరోలతో తెలుగు దర్శకుల కొత్త ప్రయోగాలు!

ఈ సరికొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో సరికొత్త వ్యాపార సమీకరణాలకు - విభిన్నమైన కాంబినేషన్లకు బలమైన వేదికగా మారుతోంది.

Update: 2026-05-26 23:30 GMT

ప్ర‌స్తుతం టాలీవుడ్ సరికొత్త స్వర్ణయుగాన్ని ఆస్వాదిస్తోంది. ఒకప్పుడు స్థానిక హీరోలతోనే సినిమాలు తీసేందుకు మొగ్గు చూపిన దర్శకులు ఇప్పుడు సరిహద్దులు దాటి పరభాషా నటులతో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలను రూపొందించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే భాషా బేధాలు పక్కన పెట్టి ఏ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోనైనా డైరెక్ట్ చేసేందుకు మేకర్స్ వెనుకాడటం లేదు. ఈ సరికొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో సరికొత్త వ్యాపార సమీకరణాలకు - విభిన్నమైన కాంబినేషన్లకు బలమైన వేదికగా మారుతోంది.

ఈ తరహా క్రాస్-బోర్డర్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ అట్లూరి ఇప్పటికే మంచి సక్సెస్ రేట్‌ను అందుకున్నారు. తమిళ స్టార్ ధనుష్‌తో `సార్`, మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్‌తో `లక్కీ భాస్కర్` వంటి విజయవంతమైన చిత్రాలను అందించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. అదే ఊపుతో వెంకీ కోలీవుడ్ టాప్ స్టార్ సూర్య హీరోగా `విశ్వనాథన్ సన్స్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో సూర్య సోదరుడు కార్తీతో కూడా మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి వెంకీ అట్లూరి అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు వినిపిస్తోంది.

తమిళ హీరో అయినా? తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న నటుడు కార్తీ. ప్రస్తుతం టాలీలీవుడ్ మేకర్స్‌తో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వంలో పాపులర్ `హిట్` ఫ్రాంచైజీ చిత్రంలో కార్తీ నటిస్తుండటం టాలీవుడ్‌లో ఇప్ప‌టికే హాట్ టాపిక్‌. దీంతో పాటు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో, యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మరో ఎంటర్‌టైనర్‌కు కూడా కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా ఎంపికైంది.

మరోవైపు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతగానో కనెక్ట్ అయిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేని కాంబినేషన్‌లో `ఆకాశంలో ఒక తార` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇలా టాలీవుడ్ దర్శకులు పరభాషా హీరోలపై మొగ్గు చూపడానికి ప్రధానంగా రెండు బలమైన కారణాలు కని పిస్తున్నాయి. టాలీవుడ్‌లోని అగ్ర హీరోలంతా ప్రస్తుతం భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో రెండేళ్ల పాటు బిజీగా ఉండటం వల్ల వారి డేట్స్ దొరకడం కష్టతరంగా మారింది. కథలు సిద్ధంగా ఉన్న దర్శకులు హీరోల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం కంటే? ఈ గ్యాప్ లో ఇతర భాషల్లో మార్కెట్ ఉన్న స్టార్స్ వైపు చూస్తున్నారు. రెండో కారణం ఏంటంటే? ఈ కాంబినేషన్ల ద్వారా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ మార్కెట్లలో ఒకేసారి సులభంగా డబుల్ బిజినెస్ సాధించే అవ‌కాశం ఉంది. ఇలా కొత్త అడుగు వేయ‌డం వ‌ల్ల తెలుగు దర్శకుల మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ , కథల ఎంపిక ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కుతుంది.

Tags:    

Similar News