శివాజీ ఒపినీయన్‌ పై డిబేట్.. థియేటర్లోనా? ఓటీటీలోనా?

ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని సినిమా చూడటం కంటే.. థియేటర్‌ కు వెళ్లి సినిమా చూడటంలో వచ్చే కిక్‌ వేరని చెప్పడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-09-04 05:28 GMT

సినిమా అంటే థియేటరేనా? ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తే అది సినిమా కాదా? ఇప్పుడు ఆ విషయమే హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ ఆ డిబేట్‌ ను స్టార్ట్ చేశాయి. ఓటీటీలో ఇంట్లో కూర్చొని సినిమా చూడటం కంటే థియేటర్‌ లో పెద్ద స్క్రీన్ పై సినిమా చూడటంలోనే అసలైన కిక్ ఉంటుందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది.

నిజానికి ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే థియేటర్‌ కు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు. మూవీ చూడాలంటే టికెట్ కొనాలి.. థియేటర్‌ కు వెళ్లాలి.. రెండున్నర గంటలు అక్కడే కూర్చోవాలి. సినిమా బాగుంటే ప్రేక్షకుల కేరింతలు.. హీరో ఎలివేషన్‌ కు అరుపులు.. పాటలకు చప్పట్లు.. ఇలా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉండేది. కానీ ఓటీటీలు వచ్చిన తర్వా లెక్కలన్నీ మారిపోయాయి. ముఖ్యంగా కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఇంట్లోనే సినిమాలు, వెబ్‌ సిరీసులు చూసే అలవాటు ప్రేక్షకులకు బాగా పెరిగింది.

ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్నా.. ఓటీటీ ఇచ్చిన కంఫర్ట్ ను చాలామంది వదులుకోలేకపోయారు. ఇప్పుడు సినిమా విడుదలైన కొద్దికాలానికే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీంతో థియేటర్లోనే చూడాలనే ఆలోచన తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీ కామెంట్స్ చర్చకు కారణమయ్యాయి. ఓటీటీలో ఇంట్లో కూర్చొని సినిమా చూడటం కంటే థియేటర్లో సినిమా చూస్తే వచ్చే అనుభూతే వేరని ఆయన అన్నారు. సినిమా అనేది ప్రేక్షకుడిని కొంతసేపు రియల్ వరల్డ్ ను మర్చిపోయేలా చేసే అనుభవమని.. ఆ అనుభూతి థియేటర్లో ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని సినిమా చూడటం కంటే.. థియేటర్‌ కు వెళ్లి సినిమా చూడటంలో వచ్చే కిక్‌ వేరని చెప్పడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు శివాజీ అభిప్రాయాన్ని సమర్థిస్తూ.. ఇంట్లో ఎంత మంచి టీవీ, సౌండ్ సిస్టమ్ ఉన్నా థియేటర్ అనుభవం రాదని అంటున్నారు. భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలను థియేటర్‌ లో చూస్తేనే అసలైన మజా ఉంటుందని చెబుతున్నారు.

హీరో కనిపించ్చినప్పుడు వందల మంది ఒకేసారి రెస్పాండ్ అవ్వడం.. క్లైమాక్స్‌ లో ప్రేక్షకుల ఎమోషన్.. ఇవన్నీ ఓటీటీలో సాధ్యం కావని అంటున్నారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టేవాళ్లూ ఉన్నారు. ఓటీటీలో సినిమా చూసే ప్రతి ఒక్కరినీ సోమరిగా చూడటం సరికాదని అంటున్నారు. పెరిగిన టికెట్ ధరలు, పార్కింగ్, జర్నీ, థియేటర్‌ లో ఫుడ్ ఖర్చులు కలిపితే కుటుంబంతో కలిసి సినిమా చూడటం సామాన్యుడికి భారంగా మారిందని చెబుతున్నారు.

అయితే ఇది థియేటర్ వర్సెస్ ఓటీటీ పోరాటం కంటే.. ప్రేక్షకుడి టేస్ట్ వర్సెస్ కంఫర్ట్ అనే చర్చగా మారింది. థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఓటీటీ ఇవ్వలేదన్నది వాస్తవమే. అదే సమయంలో ఓటీటీ ఇచ్చే కంఫర్ట్ ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్. అందుకే బడా మూవీ అయితే థియేటర్‌ కు పరుగులు తీసే ప్రేక్షకులున్నారు. కంటెంట్ బాగుంటే ఓటీటీలో కూల్ గా చూసేందుకు ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. ప్లాట్ ఫామ్ ఏదైనా ప్రేక్షకుడికి కావాల్సింది మంచి మూవీనే. అయితే ఆ సినిమాను థియేటర్లో చూడాలా.. ఇంట్లో చూడాలా అనేది ప్రేక్షకుడి నిర్ణయమే!

Tags:    

Similar News