ప్రభాస్ 'రాజా సాబ్'.. తెలంగాణలో ఎందుకంత గందరగోళం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా విడుదల ముందు రోజు తెలంగాణలో చోటుచేసుకున్న గందరగోళం ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రీమియర్స్ షోలు పడకపోవడం, రాత్రి 9 గంటల షో రద్దవడం, బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిణామాలు సినిమా మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రభాస్ సినిమాలకు తెలంగాణలో భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ప్రీమియర్స్ షోలు ఏకంగా పడలేదు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రాత్రి 9 గంటల షో రద్దయ్యింది. అంతేకాదు అర్ధరాత్రి 11.30 తర్వాత బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ప్రీమియర్స్ టికెట్ ధరలు రూ.700 నుంచి 1000 వరకు ఉండగా, అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.
అదే సమయంలో హైదరాబాద్ విమల్ థియేటర్ లో ప్రీమియర్స్ ను కేవలం మీడియా కోసం వేస్తామని మేకర్స్ ప్రకటించడంతో, అక్కడ గందరగోళం నెలకొంది. థియేటర్ వెలుపల ఉన్న కొందరు అభిమానులు లోపలికి వెళ్లిపోయారు. దీంతో వాళ్లను బయటకు పంపించింది థియేటర్ యాజమాన్యం. ఆ సమయంలో తమకు న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటన అభిమానుల అసంతృప్తిని క్లియర్ గా తెలియజేసింది.
ఏదేమైనా తెలంగాణలో టికెట్ ధరల అంశమే గందరగోళానికి ప్రధాన కారణంగా మారింది. మొదట టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వం చెప్పగా, ఆ తర్వాత అనుమతులు ఇచ్చింది. కానీ ఆ పెంపు చాలా తక్కువగా ఉండటంతో నిర్మాతలకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం కష్టమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ.105, మల్టీప్లెక్స్ ల్లో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చారు.
12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ ల్లో రూ.89 పెంపునకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అదే సమయంలో టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్ కు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ధరల పెంపు నిర్మాతల అంచనాలకు చాలా తక్కువగా ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో బుకింగ్స్ ఇంకా కొన్ని గంటల ముందు ఓపెన్ అయ్యి ఉంటే కలెక్షన్స్ మరింత పెరిగేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలా జరిగి ఉంటే తెలంగాణలో కూడా ఓపెనింగ్ డే కలెక్షన్లు గణనీయంగా పెరిగేవని అంటున్నారు. కానీ ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయినట్లైంది. ఫలితంగా నిర్మాతలకు కాస్త నష్టమే ఎదురైనట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజా సాబ్ కు తెలంగాణలో టికెట్ ధరలు, బుకింగ్స్ ఆలస్యం, ప్రీమియర్స్ రద్దు వంటి అంశాలు కలిసి గందరగోళ పరిస్థితి సృష్టించాయి. సినిమా కంటెంట్ పై కాకుండా, ఆ అంశాలపై చర్చలు జరగడం గమనార్హం.