రాజా సాబ్ ఇంకా డిసైడ్ అవలేదా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ముందు ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమా ది రాజా సాబ్.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ముందు ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై ఎవరికీ ముందు పెద్దగా అంచనాల్లేవు కానీ ఎప్పుడైతే రాజా సాబ్ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాయో ఆ తర్వాత అందరికీ సినిమాపై ఆశలు చిగురించాయి. ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి హార్రర్ కామెడీ నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడం, దానికి ప్రేమ కథా చిత్రమ్ లాంటి హార్రర్ కామెడీతో సూపర్ హిట్ అందుకున్న మారుతి దర్శకుడు కావడంతో రాజా సాబ్ పై మంచి అంచనాలేర్పడ్డాయి.
రాజాసాబ్ మరోసారి వాయిదా అంటూ వార్తలు
వాస్తవానికైతే ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమై వాయిదా పడుతూ ఆఖరికి డిసెంబర్ 5ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ డేట్ నుంచి కూడా రాజా సాబ్ పోస్ట్‌పోన్ అవుతుందని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి విశ్వప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రాజా సాబ్ గురించి పలు విషయాలతో పాటూ రిలీజ్ డేట్ గురించి మాట్లాడారు.
సంక్రాంతికి కావాలంటున్న ఫ్యాన్స్
రాజా సాబ్ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తైందని, అక్టోబర్ నాటికి సినిమా రిలీజవుతుందని, డిసెంబర్ 5 లేదా 6 తేదీల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా సంక్రాంతి లాంటి సీజన్ లో వస్తే బావుంటుందని, జనవరి 9న రాజా సాబ్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారని, కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని కోరుతున్నారని, ఆ టైమ్ లో పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో రాజా సాబ్ కు అదే కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నారని చెప్పారు విశ్వప్రసాద్.
నాలుగున్నర గంటల రా ఫుటేజ్
రాజా సాబ్ కు సంబంధించిన షూటింగ్ పాటలు మినహా దాదాపు మొత్తం పూర్తైందని, ఇప్పటికే రా ఫుటేజ్ నాలుగున్నర గంటలు వచ్చిందని, పెద్ద సినిమా దేనికైనా రా ఫుటేజ్ లో ఇంత మొత్తం కామనే అని, దాన్ని ఎడిటింగ్ టేబుల్ పై కుదించాల్సిన అవసరముందని, ఈ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని, అన్ని వర్గాల ఆడియన్స్ ను రాజా సాబ్ తప్పక అలరిస్తుందని చెప్పిన నిర్మాత త్వరలోనే రిలీజ్ డేట్ పై ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిపారు.
రాజాసాబ్2 కూడా..
రాజా సాబ్ ను ఓ ఫ్రాంచైజ్ గా చేసి, అందులో రాజా సాబ్2 కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నామని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు. అలా అని రాజా సాబ్2 సీక్వెల్ కాదని, మొదటి సినిమాకు కొనసాగింపు కాదని, పూర్తిగా కొత్త కథతో వేరే యూనివర్స్ లో ఆ ఫ్రాంచైజ్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. రాజాసాబ్ సినిమాలోని వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతూ అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.