నాని 'ప్యారడైజ్'.. ఆ రెండింటినీ కలిపి దాటేస్తుందా?
ఆ ప్రకటన తర్వాత మరోసారి సినిమా మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, ఆయా షేర్ సాంగ్ సినిమాపై విపరీతమైన హైప్ తీసుకొచ్చాయి.
నేచరుల్ స్టార్ నాని కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు వచ్చినా.. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ది ప్యారడైజ్ మూవీపైనే ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఆ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆ సినిమా ఓపెనింగ్స్ గురించి వస్తున్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్యారడైజ్ మూవీపై పలు రూమర్లు వైరల్ అయ్యాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, ఇప్పటికే తీసిన కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలన్నింటికీ చిత్ర బృందం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ 100 రోజులకు పైగా సాఫీగా పూర్తైందని, ఎక్కడా ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్లాన్ లేదని క్లారిటీ ఇచ్చింది.
ఆ ప్రకటన తర్వాత మరోసారి సినిమా మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, ఆయా షేర్ సాంగ్ సినిమాపై విపరీతమైన హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా స్లమ్ బ్యాక్ డ్రాప్ లో నాని కనిపించిన తీరు, ఆయన మాస్ మేకోవర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జడలు, ముక్కు పుడకతో పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్న నాని.. ఈసారి తన కెరీర్ లోనే మోస్ట్ వైల్డ్ పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక్కడే అసలు చర్చ మొదలైంది. నాని గత చిత్రం హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు దాదాపు రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంతకుముందు వచ్చిన దసరా కూడా మొదటి రోజు సుమారు రూ.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అప్పట్లో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇప్పుడు ది ప్యారడైజ్ మాత్రం ఆ రెండు సినిమాల రికార్డులను కలిపినా దాటేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.
కొంతమంది ట్రేడ్ పండితులు.. ఆ సినిమాకు రూ.100 కోట్ల వరకు ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిజానికి నాని ఇప్పటివరకు ఏ సినిమాతోనూ తొలి రోజు రూ.100 కోట్ల క్లబ్ లోకి వెళ్లలేదు. కానీ గత కొన్ని మూవీలతో ఆయన మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా దసరా, హిట్ 3, సరిపోదా శనివారం లాంటి సినిమాలు నానికి మాస్ ఆడియన్స్ లో భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే క్రేజ్ ది ప్యారడైజ్ కు ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా తర్వాత నాని- శ్రీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఆ సినిమా.. నాని కెరీర్ ను మరో లెవల్ కు తీసుకెళ్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.