'మమ్మీ' ఫ్రాంఛైజీలో 4వ చిత్రం గూస్ బంప్స్ గ్యారెంటీ!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టి.. థ్రిల్లింగ్ అడ్వెంచర్స్‌తో అలరించిన `ది మమ్మీ` ఫ్రాంఛైజీ మళ్లీ వార్తల్లో నిలిచింది.;
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టి.. థ్రిల్లింగ్ అడ్వెంచర్స్‌తో అలరించిన `ది మమ్మీ` ఫ్రాంఛైజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 1999లో ప్రారంభమైన ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ ఇప్పటికే మూడు భాగాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సిరీస్‌లో రాబోతున్న నాలుగో సినిమా `ది మమ్మీ 4` కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేశారు. భారతదేశంలో కూడా ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రఖ్యాత డెడ్‌లైన్ కథనం ప్రకారం.. `ది మమ్మీ 4`విడుదల తేదీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని 2028 మే 19న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా దీనిని దాదాపు ఏడాది ముందే.. అంటే 2027 అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మార్పుతో అభిమానులు తమ అభిమాన అడ్వెంచర్ సిరీస్‌ను అనుకున్న దానికంటే ముందే వెండితెరపై చూసే అవకాశం లభించింది. పాత తేదీని మరో ప్రతిష్టాత్మక సినిమా కోసం వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నాలుగో భాగంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అసలైన స్టార్ జోడీ బ్రెండన్ ఫ్రేజర్ - రాచెల్ వీజ్ అధికారికంగా తిరిగి వస్తున్నారు. బ్రెండన్ ఫ్రేజర్ తన ఐకానిక్ పాత్ర`రిక్ ఓ`కానెల్‌గా, రాచెల్ వీజ్ `ఎవెలిన్ కర్నాహన్`గా ప్రేక్షకులను అలరించనున్నారు. గతంలో వీరిద్దరి రాకపై చర్చలు జరిగినా.. ఇప్పుడు వారి భాగస్వామ్యం ఖరారు కావడంతో ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెరిగాయి. మ్యాట్ బెటినెల్లి-ఓల్పిన్ .. టైలర్ గిల్లెట్ (రేడియో సైలెన్స్ అని కూడా పిలుస్తారు) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..డేవిడ్ కాగ్గేషాల్‌తో కలిసి వారు కథను అందిస్తున్నారు.
`ది మమ్మీ` ఫ్రాంఛైజీ చరిత్రను పరిశీలిస్తే... 1999లో విడుదలైన మొదటి చిత్రం ఒక అడ్వెంచర్ క్లాసిక్‌గా నిలిచింది. ఆ తర్వాత 2001లో `ది మమ్మీ రిటర్న్స్` విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 2008లో వచ్చిన మూడవ భాగం `ది మమ్మీ: టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్`లో బ్రెండన్ ఫ్రేజర్ నటించినా.. రాచెల్ వీజ్ స్థానంలో మరియా బెల్లో ఎవెలిన్ పాత్రను పోషించారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అసలు సిసలైన కాంబినేషన్ కుదరడంతో ఈ సీక్వెల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుల ద్వయం మ్యాట్ - టైలర్ తమదైన శైలిలో అత్యాధునిక గ్రాఫిక్స్‌తో ఈ అడ్వెంచర్‌ను రక్తి కట్టించబోతున్నారు. పురాతన ఈజిప్ట్ నేపథ్యం, మమ్మీల ప్రతీకారం.. అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఈ నాలుగో భాగంలో హైలైట్‌గా నిలవనున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, మిగిలిన నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.