కేరళ స్టోరీ సీక్వెల్.. కేరళ సీఎం ఏమన్నారంటే?
వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీకి సీక్వెల్ గా రూపొందుతున్న ది కేరళ స్టోరీ 2 విడుదలకు ముందే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.;
కేరళలో మరోసారి ది కేరళ స్టోరీ సినిమా కోసం జోరుగా చర్చ జరుగుతోంది. వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీకి సీక్వెల్ గా రూపొందుతున్న ది కేరళ స్టోరీ 2 విడుదలకు ముందే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 27వ తేదీన సినిమా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతుండగా, దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే కేరళ స్టోరీ మూవీ.. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించారు. మతపరమైన విభజనను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే సినిమా తీసినట్లు కనిపిస్తోందన్నారు. గతంలోనే దర్యాప్తు సంస్థలు, కోర్టులు లవ్ జిహాద్ అనే అంశాన్ని ప్రూఫ్ లేనిదిగా తేల్చాయని గుర్తుచేశారు. అలాంటి విషయాన్ని మళ్లీ సినిమాగా తీసుకురావడం సమాజంలో ద్వేషాన్ని పెంచే ప్రయత్నమని ఫైర్ అయ్యారు.
దేశంలో లిటరసీ, సోషల్ డెవలప్మెంట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కేరళను ఉగ్రవాదానికి సెంటర్ గా చూపించడం తప్పుడు ఉద్దేశ్యమని పినరయి విజయన్ అన్నారు. ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల్లో భయం, అపోహలు సృష్టించేందుకు సినిమాను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి విద్వేషపూరిత ప్రచార చిత్రాలను ప్రజలు ఒక్కటై రిజెక్ట్ చేయాలని పిలుపునిచ్చారు.
ఆ విషయంలో అధికార ఎల్‌డీఎఫ్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో సినిమా.. విడుదలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతే కాదు వివాదం మరింత పెద్దది అవుతుండడంతో రిలీజ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక మూవీ టీమ్ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది. నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ, ఎవరినీ టార్గెట్ చేసుకుని సినిమా తీయలేదని స్పష్టం చేశారు.
సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథను రూపొందించామని చెప్పారు. సినిమా పూర్తిగా చూసిన తర్వాతే విమర్శలు చేయాలని కోరారు. గతంలో వచ్చిన ఫస్ట్ పార్ట్ కూడా వివాదాలకు కారణమైంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ కూడా అదే రీతిలో చర్చలకు దారి తీస్తోంది. ముఖ్యంగా సినిమాలో మరిన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ ను టచ్ చేసినట్లు టాక్ వినిపిస్తుండడంతో హాట్ టాపిక్ గా మారింది.
ది కేరళ స్టోరీ 2 విడుదలకు ముందే కేరళలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరోవైపు చిత్ర యూనిట్ తమ క్రియేటివ్ ఫ్రీడం ను సమర్థిస్తోంది. ఏదేమైనా వివాదాల మధ్య సినిమాకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.