కలకత్తా కాళీమాత సాక్షిగా 'ది బెంగాల్ ఫైల్స్' బెంగాల్‌లో విడుదల
వివాదాస్పద చిత్రం `ది బెంగాల్ ఫైల్స్` ఎట్టకేలకు ప్రభుత్వం మారిన తర్వాత బెంగాల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.;
వివాదాస్పద చిత్రం `ది బెంగాల్ ఫైల్స్` ఎట్టకేలకు ప్రభుత్వం మారిన తర్వాత బెంగాల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం ఈ సినిమాను విడుదల కాకుండా నిరోధించగా.. ఇప్పుడు కొత్తగా పగ్గాలు చేపట్టిన భాజపా ప్రభుత్వం సినిమా విడుదలకు మార్గం సుగమం చేసింది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా గతేడాదే విడుదలైనా.. బెంగాల్‌లో మాత్రం అడ్డంకులు ఎదుర్కొంది. చరిత్రలోని బెంగాల్ విభజన - ముస్లిం లీగ్ వివాదం వంటి సున్నితమైన అంశాలను స్పృశించడం వల్ల అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లు ఈ సినిమా విడుదలను అడ్డుకున్నాయనే విశ్లేషణలు సాగాయి.
భారతీయ చలనచిత్ర రంగం ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు.. సామాజిక వర్గాల ఆంక్షల మధ్య నలిగిపోతోంది. సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సి) ఒక చిత్రానికి చట్టబద్ధమైన అనుమతిని ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిభద్రతల సాకుతో సినిమాలను నిలిపివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా మారిందని విమర్శలొచ్చాయి. కళను కళగా చూడకుండా రాజకీయ రంగు పులిమి ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని న్యాయ నిపుణులు `సాంస్కృతిక నియంతృత్వం`గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సినిమాలు ఆగిపోవడం వల్ల చిత్ర పరిశ్రమలో ఒక రకమైన గందరగోళం.. భయం నెలకొంటోంది. వాస్తవ రూపంలో ఉండే కథలను చెప్పడానికి దర్శకరచయితలు, నిర్మాతలు భవిష్యత్తులో వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. ఇది సృజనాత్మకతను చంపేసి.. కేవలం అధికార వర్గాలకు లేదా కొన్ని వర్గాలకు అనుకూలమైన కథలకే సినిమా రంగాన్ని పరిమితం చేస్తుంది. ఒక సినిమా చూసి అందులోని మంచి చెడులను విశ్లేషించుకునే విజ్ఞత ప్రేక్షకులకు ఉన్నా.. వారి తరపున రాజకీయ పార్టీలే నిర్ణయాలు తీసుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛను అవమానించడంగా పరిగణించాల్సి ఉంటుంది.
మరోవైపు డిజిటల్ యుగంలో `బాయ్‌కాట్` సంస్కృతి ఒక `అదృశ్య సెన్సార్‌షిప్`గా మారి వేధిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో రచయితలు తమ కథల్లోని కీలక అంశాలను ముందే తొలగించుకునే స్వీయ సెన్సార్‌షిప్ వైపు మళ్లుతున్నారు. ఏదైనా ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయేమో అనే భయం క్రియేటర్లను సంకెళ్లతో కట్టేస్తోంది. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దెబ్బతినడమే కాకుండా.. సినిమాపై ఆధారపడిన వందలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి.
సోషల్ మీడియాలో పెరుగుతున్న ఈ తీవ్ర ధోరణులు ఆరోగ్యకరమైన చర్చకు బదులు ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజం.. కానీ ఏదో ఒక వర్గానికి నచ్చని అంశాలను పూర్తిగా తొలగించాలని పట్టుబట్టడం వల్ల `భిన్నత్వంలో ఏకత్వం` అనే సామాజిక సూత్రం దెబ్బతింటోంది. వ్యవస్థీకృతమైన ఈ బాయ్‌కాట్ ట్రెండ్స్ ప్రజాస్వామ్య విలువలకు పెద్ద సవాలుగా పరిణమించాయి. కళను రాజకీయాలకు అతీతంగా ఉంచినప్పుడే సమాజంలో ఆరోగ్యకరమైన మార్పులు సాధ్యమవుతాయి.
వివాదంతో ముడిపడిన అంశం:
`ది బెంగాల్ ఫైల్స్` చిత్రం ప్రధానంగా 1946 నాటి కలకత్తా అల్లర్లు, బెంగాల్ విభజన సమయంలో జరిగిన హింస .. నాటి రాజకీయ పరిణామాలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించారు. చారిత్రక వాస్తవాలను వెలికితీసే సాకుతో ఈ సినిమా గతంలోని ముస్లిం లీగ్ పాత్రను .. సున్నితమైన మతపరమైన అంశాలను ప్రత్యక్షంగా ప్రస్తావించడం తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద చిక్కులు తెచ్చిపెట్టిందనే చర్చ సాగింది. పశ్చిమ బెంగాల్‌లో బలమైన ముస్లిం ఓటు బ్యాంకును కలిగి ఉన్న టీఎంసీ ఈ చిత్రం మతపరమైన ఉద్రిక్తతలను పెంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని... అలాగే తమ ప్రభుత్వ లౌకిక ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యం చేసుకుందని ఆందోళన చెందింది. ఈ సినిమాలోని అంశాలు ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చి... ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి రాజకీయంగా మైలేజీ ఇచ్చే అవకాశం ఉండటమే తృణమూల్ కాంగ్రెస్ ఈ చిత్ర విడుదలను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అన్న చర్చా సాగింది.