వివాదాస్పద సినిమా ప్రమోషన్స్‌కి పెద్ద ప్లాన్‌..!

తాజాగా ఈయన 'ది బెంగాల్ ఫైల్స్' సినిమాను రూపొందించారు. వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో రాబోతున్న ఫైల్స్ ప్రాంచైజీ మూవీల్లో బెంగాల్‌ ఫైల్స్ మూవీ చివరిదిగా తెలుస్తోంది.;

Update: 2025-06-28 15:30 GMT

2019లో 'తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి వార్తల్లో నిలిచాడు. వివాదాస్పద అంశాలను ఎంపిక చేసుకుని మరీ సినిమాలు తీస్తాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన పంథా మాత్రం మార్చుకోవడం లేదు. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒక వైపు విమర్శలతో పాటు మరో వైపు ఈ సినిమాకు వందల కోట్ల కలెక్షన్స్ నమోదు అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సాధించిన వసూళ్లు అప్పట్లో రికార్డ్‌ను సృష్టించాయి. దాదాపుగా రూ.350 కోట్ల వసూళ్లు సాధించిన ది కశ్మీర్‌ ఫైల్స్ తర్వాత వివేక్ ఆత్రేయ నుంచి 'ది వాక్సిన్‌ వార్‌' సినిమా వచ్చింది. ఈయన సినిమాలు ఒక పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఉంటున్నాయి అనే విమర్శలు సైతం వస్తున్నాయి.

తాజాగా ఈయన 'ది బెంగాల్ ఫైల్స్' సినిమాను రూపొందించారు. వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో రాబోతున్న ఫైల్స్ ప్రాంచైజీ మూవీల్లో బెంగాల్‌ ఫైల్స్ మూవీ చివరిదిగా తెలుస్తోంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వివేక్ అగ్ని హోత్రి మాట్లాడుతూ ది బెంగాల్‌ ఫైల్స్ తర్వాత మరే ఫైల్స్‌ను చేయబోవడం లేదని పేర్కొన్నాడు. బెంగాల్‌ ఫైల్స్ సినిమా మొత్తం ఇండియాను కుదిపేస్తుందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌ ఫైల్స్‌లో చూసిన హింసాత్మక ఘటనలతో పోల్చితే బెంగాల్‌ ఫైల్స్‌లో ఉండే ఊచకోత అత్యంత దారుణంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల హోరు మొదలైంది. త్వరలో చిత్ర యూనిట్‌ సభ్యులు యూఎస్‌లో ప్రీమియర్‌లకు రెడీ అవుతున్నారు.

ది బెంగాల్‌ ఫైల్స్ సినిమాను 2025, సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా దాదాపుగా పూర్తి అయింది. సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం ప్రీమియర్‌ షో లను వివేక్ అగ్నిహోత్రి మార్గంగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్లాన్‌ చేస్తున్నారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించింది. యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్‌ షోలకు వచ్చే స్పందన బట్టి ఇండియాలో ఓపెనింగ్స్‌ ఉండే అవకాశం ఉంది. అందుకే యూఎస్‌లో భారీ ఎత్తున ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

జులై 19 నుంచి మొదలుకుని ఆగస్టు మూడో వారం వరకు సినిమాను యూఎస్‌లో ప్రమోట్‌ చేస్తారని తెలుస్తోంది. బెంగాల్‌ ఫైల్స్ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పునీత్ ఇస్సార్, గోవింద్ నామ్‌దేవ్, బబ్బు మాన్, పల్లవి జోషి, పలోమి ఘోష్, మోహన్ కపూర్, నమాషి చక్రవర్తి, అనుభా అరోరా ముఖ్య పాత్రల్లో నటించారు. 1940లలో అవిభక్త బెంగాల్‌లో జరిగిన మత హింసను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు ఈ సినిమాలో చూపిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ప్రమోషన్స్‌ పేరుతో ప్రీమియర్‌ షోలు వేయడం ద్వారా కచ్చితంగా మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా వివాదాస్పద అంశాలు ఉంటాయి కనుక అవి కూడా ప్రమోషన్స్‌కి హెల్ప్‌ అవుతాయి. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్‌కి పెద్ద ప్లాన్స్ వేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News