తమన్ టాప్ 3 లెక్క.. ఇది గమనించారా..
ముఖ్యంగా సోషల్ మీడియా జనరేషన్ లో ఒక్క పాట క్లిక్ అయితే చాలు.. సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.;
సినిమా విజయానికి మ్యూజిక్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ముఖ్యంగా సోషల్ మీడియా జనరేషన్ లో ఒక్క పాట క్లిక్ అయితే చాలు.. సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మాస్ బీట్స్, క్యాచీ ట్యూన్స్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సాంగ్స్ ఇవ్వడంలో తమన్ స్టైల్ వేరు అని అభిమానులు చెబుతుంటారు.
ప్రస్తుతం యూట్యూబ్ లో 600 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తెలుగు పాటల జాబితాలో టాప్ 3 స్థానాల్లో ఉన్న పాటలన్నీ తమన్ సంగీతం అందించినవే కావడం విశేషంగా మారింది. అందులో మొదటి రెండు పాటలు అలా వైకుంఠపురంలో చిత్రంలోని సాంగ్స్ కావడం మరింత ఆసక్తికరం. ఆ సినిమాలోని బుట్టబొమ్మ పాట ఇప్పటికే సుమారు 890 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుండగా, రాములో రాములా పాట 695 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
ఆ రెండు పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో, షార్ట్ వీడియో ప్లాట్ ఫార్మ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ స్టైల్, తమన్ సంగీతం, క్యాచీ లిరిక్స్ కలిసి ఆ సాంగ్స్ ను పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ చేశాయి. ఇప్పుడు అదే జాబితాలో మూడో పాటగా చేరింది గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి. ఆ పాట రీసెంట్ గా యూట్యూబ్ లో 600 మిలియన్ల వ్యూస్ మార్క్ ను దాటింది. అంతేకాదు.. అత్యంత వేగంగా ఆ ఫీట్ అందుకున్న తెలుగు పాటల్లో ఒకటిగా నిలిచింది.
సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, పాటలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కుర్చీ మడతపెట్టి పాట విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీల్స్, షార్ట్ వీడియోలు, కవర్ సాంగ్స్.. ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించింది. ముఖ్యంగా ఆ సాంగ్ కు యువత నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మాస్ బీట్ కు తగ్గట్టు తమన్ ఇచ్చిన ట్యూన్, ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేసింది.
ఆ పాటకు సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి ప్రత్యేక శైలిలో లిరిక్స్ రాయగా, సాహితి చాగంటి, శ్రీకృష్ణ జోష్ లో ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు పాటకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఇందులో మహేష్ బాబు వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ శ్రీలీల కూడా తన డ్యాన్స్ తో పాటకు ఎక్స్ట్రా అట్రాక్షన్ గా నిలిచింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏజెంట్ తాత డైలాగ్ నుంచి ఆ పాటను రూపొందించారనే విషయం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ వైరల్ పదాలను మాస్ బీట్ గా మార్చి తీసుకెళ్లడంలో తమన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు 600 మిలియన్ల వ్యూస్ క్లబ్ లో టాప్ 3 తెలుగు పాటలు కూడా తమన్ ఖాతాలో ఉండటం.. టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్ లో ఆయన డామినేషన్ ను ఎగ్జాంపుల్!!