అమ్మ నమ్మింది.. ప్రపంచం చప్పట్లు కొట్టింది!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సక్సెస్ వెనుక కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఒక తల్లి నమ్మకం కూడా ఉందని ఆయన చెప్పిన తాజా కామెంట్స్ చెప్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సక్సెస్ వెనుక కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఒక తల్లి నమ్మకం కూడా ఉందని ఆయన చెప్పిన తాజా కామెంట్స్ చెప్తున్నాయి. చిన్ననాటి నుంచి తన జీవితాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి తన తల్లేనని, తాను ఈ స్థాయికి రావడానికి కారణం ఆమె నమ్మకమేనని తమన్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్, తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కేవలం 33 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమెకు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దారిని ఎంచుకోలేదని తెలిపారు. తనని, తన చెల్లిని హాస్టల్‌లో పెట్టి మరో పెళ్లి చేసుకుని తన జీవితాన్ని చూసుకోవచ్చు. కానీ తన తల్లి అలా చేయలేదని, తన లైఫ్ ను పక్కన పెట్టి మరీ కొడుకు టాలెంట్‌ణే నమ్ముకుందని ఆయన అన్నారు.
తనకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్‌ను గుర్తించిన తల్లి, కొడుకు డ్రమ్మర్ అవుతాడనే నమ్మకంతో పెద్ద డెసిషన్ తీసుకుందని తమన్ వెల్లడించారు. తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన ఎల్‌ఐసీ డబ్బును కూడా కుటుంబ భద్రత కోసం దాచకుండా, తన మ్యూజిక్ జర్నీ కోసం డ్రమ్స్ కొనిపించిందని చెప్పారు. ఆ టైమ్ లో రూ.60 వేల విలువైన డ్రమ్స్ కొనిపించడం కుటుంబానికి చిన్న విషయం కాదని, కానీ తన తల్లి తన కలను డబ్బు కంటే పెద్దదిగా చూసిందని పేర్కొన్నారు.
తాను ఇలా ఉన్నానంటే కారణం తన తల్లేనని, ఆమె నమ్మకమే తనకు బలాన్నిచ్చిందని, తన కోసం చేసిన త్యాగాలను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేనని తమన్ అన్నారు. చిన్నప్పుడు తాముండే చోట బావి ఉండేదని, అటు వైపు వెళ్లిపోతాననే భయంతో ఎప్పుడూ తనను ఎత్తుకునే తిరిగేదని, చిన్నప్పుడు కూడా తాను ఎంతో లావుగా ఉండేవాడినని, అలాంటి ఆమెను ఇప్పుడు తానే చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా తమన్ చెప్పారు.
తమన్ మాటల్లో ఎక్కువగా ఆకట్టుకున్న అంశం తల్లి నమ్మకానికి ఆయన ఇచ్చిన విలువ. ఒక తల్లి తన కొడుకుపై ఉంచిన నమ్మకం, అతని కలలను నిలబెట్టేందుకు చేసిన త్యాగం, చివరకు దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచే స్థాయికి తీసుకెళ్లిందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తమన్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సక్సెస్ వెనుక ఉన్న ఫ్యామిలీ సపోర్ట్, ముఖ్యంగా తల్లి విశ్వాసం ఎంత కీలకమో మరోసారి గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.