'నేను నమ్మేదాన్నే బలంగా నమ్ముతా'.. 'శంబాల' ఈవెంట్ లో విశ్వప్రసాద్
ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ గారు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.;
ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ గారు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. సాధారణంగా ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ మాట్లాడితే మాత్రం పాయింట్ సూటిగా ఉంటుంది. ఈ ఈవెంట్ లో ఆయన సినిమా గురించి, తన పర్సనల్ ఫిలాసఫీ గురించి చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతల గురించి చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన మహిధర్ రెడ్డి తనకు 20 ఏళ్లుగా తెలుసని విశ్వప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ అమెరికాలోని సియాటెల్ లో ఉండేవారని, అక్కడ ఇండియన్ సినిమాలను రిలీజ్ చేసే సమయంలో తాము పార్ట్నర్స్ గా ట్రావెల్ అయ్యామని చెప్పారు. సినిమాల మీద ఉన్న ప్యాషన్ తోనే వాళ్లు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారని, వారి కష్టం తెరపై కనిపిస్తోందని ఆయన మెచ్చుకున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే, ఆడియెన్స్ కంటే ముందే విశ్వప్రసాద్ గారు 'శంబాల' సినిమాను చూసేశారట. సుమారు రెండు, మూడు వారాల క్రితమే తాను సినిమా చూశానని, కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కితాబిచ్చారు. సైన్స్ నమ్మకం మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా అని, ఆ పాయింట్ ను డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని ఆయన రివ్యూ ఇచ్చారు.
హీరో ఆది సాయికుమార్ కు ఇది చాలా మంచి సినిమా అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కరెక్ట్ హాలిడే సీజన్ లో, క్రిస్మస్ టైమ్ లో ఈ సినిమా వస్తుండటం పెద్ద ప్లస్ పాయింట్ అని అన్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటలతో టీమ్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం హైలైట్ గా నిలిచింది.
"మీరు లైఫ్ లో ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంటి?" అని అడిగితే.. "నేను దేన్నైతే నమ్ముతానో.. ఆ నమ్మకాన్నే బలంగా నమ్ముతాను" అని సింపుల్ గా అయినా చాలా పవర్ ఫుల్ గా చెప్పారు. మన మీద మనకు, మన నిర్ణయాల మీద నమ్మకం ఉండాలనేది ఆయన ఉద్దేశం. మొత్తానికి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్న విశ్వప్రసాద్ గారు, ఒక చిన్న సినిమాకు వచ్చి సపోర్ట్ చేయడం గొప్ప విషయం. ఇక డిసెంబర్ 25న విడుదలవుతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఇక ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను ఆడియెన్స్ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తారో చూడాలి.