'తెలుసు కదా' వసూళ్ల సంగతేంటి? 9 రోజుల్లో ఎంత రాబట్టింది?
2025 దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో తెలుసు కదా కూడా ఒకటి.;
2025 దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో తెలుసు కదా కూడా ఒకటి. రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్టైనర్ గా టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఆ సినిమాను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వం వహించారు. ఆ మూవీతోనే ఆమె దర్శకురాలిగా మారారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ రూపొందించిన ఆ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా కనిపించారు. శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 17వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా.. విడుదలకు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
కానీ సినిమా మాత్రం వాటిని అందుకోలేకపోయింది. ప్రత్యేకమైన కథతో రూపొందినప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో అందరినీ మెప్పించలేకపోయింది. కేవలం యూత్ ను మాత్రమే ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టోరీ విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాస్త మెచ్యూర్ గా ఆలోచించిన సినీ ప్రియులతోపాటు క్రిటిక్స్ కు మూవీ నచ్చింది.
ఏదేమైనా సినిమా ఓవరాల్ గా మిక్స్ డ్ టాక్ అందుకుంది. దాని ఎఫెక్ట్ వసూళ్లపై కూడా పడింది. వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్లకుపైగా ఓపెనింగ్స్ సాధించినట్లు తెలియగా.. మొదటి వారం రూ.6 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.8.7 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది అంచనాల కంటే చాలా తక్కువ.
నిజానికి.. తెలుసు కదా మూవీ రూ.35 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్లు ఇప్పటికే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నటీనటుల రెమ్యునరేషన్స్, షూటింగ్ ఖర్చు, ప్రమోషన్స్ ఖర్చు కలిపి అంత అయినట్లు చెప్పాయి. అయితే రిలీజ్ కు ముందే అన్ని డీల్స్ కంప్లీట్ అయ్యాయి. ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ రూ. 16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
శాటిలైట్ రైట్స్ రూ. 8 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ రూ.1.5 కోట్లకు సేల్ అయినట్లు వినికిడి. దీంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మేకర్స్ రూ.25.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లు అయినట్లు టాక్. దీంతో రూ. 25 కోట్లు గ్రాస్ వసూళ్ల మార్క్ ను బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ మార్క్ కు తెలుసు కదా మూవీ చాలా దూరంలో ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.