ఏడో నెలలో ఏడు రీ రిలీజ్‌లు, కానీ..!
కొత్త సినిమాలను థియేటర్‌కి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపించని ప్రేక్షకులు పాత సినిమాలను మాత్రం థియేటర్‌కి వెళ్లి మరీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు;
కొత్త సినిమాలను థియేటర్‌కి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపించని ప్రేక్షకులు పాత సినిమాలను మాత్రం థియేటర్‌కి వెళ్లి మరీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలకు దక్కుతున్న పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో వరుసగా చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. గతంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాకుండా, గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. ఫ్లాప్ అయిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సొంతం చేసుకున్న దాఖలాలు టాలీవుడ్‌లో ఉన్నాయి. ఆరంజ్ సినిమా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనడంలో సందేహం లేదు.
ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు మాత్రమే రీ రిలీజ్ కావడం మనం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చిన్న హీరోల సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు కూడా ఎన్నో కొన్ని థియేటర్‌లలో రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడో నెలలో ఏకంగా ఏడు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉంటే.. మిగిలిన సినిమాలు చిన్న హీరోల సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. ఈ నెలలో విడుదల కాబోతున్న ఏడు సినిమాల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాలు మిరపకాయ్, గజిని, ఏమాయ చేశావే. ఈ మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేస్తాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
ఈ మూడు సినిమాలతో పాటు ఎంఎస్ ధోనీ, కుమారి 21ఎఫ్, హుషారు, వీడొక్కడే సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ నెల హుషారు సినిమా రీ రిలీజ్ తో ప్రారంభం కాబోతుంది. జులై 4న హుషారు సినిమా రీ రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమా అప్పట్లో థియేట్రికల్ రిలీజ్‌లో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రీ రిలీజ్ బజ్ ఉంది. ఇక జులై 7వ తారీకున ఎంఎస్ ధోనీ సినిమా దిగనుంది. హిందీ సినిమాకు డబ్బింగ్ అయినప్పటికీ తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందుకే రీ రిలీజ్‌లో మంచి వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్‌ను ఇష్టపడే ప్రేక్షకులు, స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారు, బయోపిక్స్‌పై ఆసక్తి చూపించే వారు, ముఖ్యంగా ధోనీ అభిమానులు ఈ సినిమాను చూస్తారు అనడంలో సందేహం లేదు.
జులై 10న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కుమారి 21ఎఫ్ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా కుర్రకారును మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతుంది. రీ రిలీజ్‌లోనూ మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. జులై 11న మిరపకాయ్ సినిమా రీ రిలీజ్‌కు రెడీగా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. మంచి హిట్ బొమ్మ అయిన మిరపకాయ్ కచ్చితంగా రీ రిలీజ్లోనూ సూపర్ హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
జులై 18న గజిని సినిమా విడుదల కాబోతుంది, తమిళ్ మూవీ అయినప్పటికీ తెలుగులో మంచి ఆధరణ దక్కించుకుంది. అందుకు రీ రిలీజ్ పై నమ్మకం ఉంది. జులై 19న నాగ చైతన్య, సమంతల కల్ట్ లవ్ స్టోరీ ఏ మాయ చేశావే రీ రిలీజ్ కానుంది. యూత్ లో ఇప్పటికీ ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే రీ రిలీజ్ కి మంచి బజ్ క్రియేట్ అయింది. జులై 19న వీడొక్కడే సినిమా రీ రిలీజ్ కానుంది. సూర్య, తమన్నా నటించిన ఈ తమిళ సినిమాకు తెలుగులో రీ రిలీజ్ ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి. మొత్తానికి ఈ ఏడో నెలలో ఏడు రీ రిలీజ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఏది ఆడుతుంది, ఏది డబ్బులు తెచ్చి పెడుతుంది అనేది చూడాలి.