57వ IFFIలో తెలంగాణ- ఏపీ సినిమాల సరికొత్త ప్రస్థానం!
| గోవాలో జరుగుతున్న 57వ IFFIలో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘మయసభ’ ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు నామినేట్ కాగా, ‘చాంద్ తారా వేవ్స్’ ఫిల్మ్ బజార్‌లో ప్రదర్శితమైంది. ఇండియన్ పనోరమాలోనూ పలు తెలుగు చిత్రాలకు చోటు దక్కింది. ప్రయోగాత్మక, కమర్షియల్ కథలతో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
తెలుగు సినిమా అంటే భారీ మాస్ ఎంటర్‌టైనర్లు.. కమర్షియల్ హంగులే అన్న పాత ముద్రను గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికగా తెలుగు కథలు చెరిపేస్తున్నాయి. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ నేపథ్యాల నుంచి వస్తున్న వైవిథ్యమైన చిత్రాలు.. సిరీస్‌లు ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా నిలిచి ప్రాంతీయ సినిమా పరిధిని అంతకంతకు విస్తృతం చేస్తున్నాయి. ఒకే కోణంలో కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు.. కమర్షియల్ సినిమాలు.. పాత క్లాసిక్‌ల పున ప్రదర్శనతో తెలుగు కథలు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఓటీటీ విభాగంలో `మయసభ: ద రైజ్ ఆఫ్ ద టైటాన్స్` ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు నామినేట్ కావడం తెలుగు కథా బలానికి దక్కిన గౌరవంగా దర్శకుడు దేవా కట్టా భావిస్తున్నారు. ఇతర భాషల సిరీస్‌లతో పోటీ పడుతూ తెలుగు సిరీస్ ఈ స్థాయికి చేరడం విశేషషమన్నారు. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు వేసిన బాటలో ఇది మరో ముందడుగు అన్నారు. ఓటీటీ అనేది రచయితల మాధ్యమమని.. మయసభ వంటి సిరీస్ రాయడం మూడు నాలుగు సినిమాల పనితో సమానమని ఈ గుర్తింపు కొత్త దర్శకులను ఓటీటీ వైపు ఆకర్షిస్తుందని దేవా కట్టా అభిప్రాయపడ్డారు.
ఫీల్మ్ హిస్టోరియన్ డాక్టర్ హరికృష్ణ మామిడి దృష్టిలో ఆరు సమకాలీన చిత్రాలు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈసారి ఐఎఫ్ ఎఫ్ ఐలో తెలుగు సినిమాకు లభించిన ప్రాధాన్యం కీలక మలుపు. గతంలో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆర్ట్, పారలల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని.. కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఉండే తెలుగు చిత్రాలకు తగిన గుర్తింపు దక్కేది కాదని గుర్తు చేశారు. `మా భూమి`,` శంకరాభరణం`, `సాగర సంగమం`, `దాసి` వంటి చిత్రాల ప్రయాణాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం నిబంధనలు మారడం.. కమర్షియల్ సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల తెలుగు సినిమాకు సరైన గౌరవం దక్కుతోందన్నారు.
స్వతంత్ర చిత్రాల విభాగంలో వై, వాణి? వరల్డ్ ప్రీమియర్ ఆ టీమ్‌కు ఊహించని అనుభవాన్ని మిగిల్చింది. కొత్త దర్శకుడు ధనుష్ దండు తెరకెక్కించిన కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాకు నాలుగు రోజుల ప్రణాళికతో వెళ్లినా? బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే షోలు సోల్డ్ అవుట్ అయ్యాయని చెప్పారు. మూడో రోజుకే ప్రదర్శనలు పూర్తిగా నిండిపోవడం.. ఒక సినిమాకు సరైన వేదిక దొరకడం ఎంత ముఖ్యమో చూపిందని.. పదేళ్లు, పదిహేనేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే వేదికలు ఉండాలని ధనుష్ అన్నారు.
మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నాటక, సినీ దర్శకుడు మొహమ్మద్ అలీ బేగ్ తెరకెక్కించిన పీరియడ్ డ్రామా `చాంద్ తారా వేవ్స్` ఫిల్మ్ బజార్‌లో ప్రదర్శితమైంది. 17వ శతాబ్దపు గోల్కొండ నేపథ్యంలో తారామతి, అబ్దుల్లా కుతుబ్ షా కథ ఆధారంగా రూపొందిన చిత్రం ద్వారా దక్కన్ కథలను జాతీయ వేదికపైకి తీసుకెళ్లడం సంతోషంగా ఉందని బేగ్ తెలిపారు. ప్రేమ, కళ, సంబంధాల నేపథ్యంలో సార్వత్రిక స్వభావం ఇచ్చామన్నారు. హైదరాబాద్, తెలంగాణ కథలను చాలా మంది ప్రేక్షకులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు.
వీటితో పాటు ఇండియన్ పనోరమా విభాగంలో సింగ్ గీతం (ఫీచర్ ఫిల్మ్), `మన శంకర వర ప్రసాద్ గారు` (మెయిన్‌స్ట్రీమ్ సినిమా), `విన్` (నాన్-ఫీచర్ ఫిల్మ్) వంటి చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. అలాగే ఉత్తమ తొలి దర్శకుడి విభాగంలో చెన్నై లవ్ స్టోరీ నామినేట్ కాగా.. 1976 నాటి `భక్త కన్నప్ప` గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ప్రత్యేకంగా నిలిచింది.