'చిరు పిలిస్తే వెళ్లి బాధలు చెప్పుకుంటాం'.. ఐదుగురు ఎగ్జిబిటర్లు రెడీ
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తో పాటు పలువురు ఎగ్జిబిటర్లు మాట్లాడారు. వారు చేసిన కామెంట్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణలో థియేటర్ల రెంటల్ విధానం, పర్సంటేజ్ సిస్టమ్ వివాదం మరోసారి వేడెక్కింది. కొద్ది నెలలుగా సింగిల్ థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తాజాగా మరింత గట్టిగా మాట్లాడింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదలకు ముందే ఆ అంశం పెద్ద చర్చకు దారితీసింది.
శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక ప్రకటన చేశారు. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తో పాటు పలువురు ఎగ్జిబిటర్లు మాట్లాడారు. వారు చేసిన కామెంట్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ముఖ్యంగా సమస్య పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని ఎగ్జిబిటర్లు ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవి గారు పిలిస్తే ఐదుగురు ఎగ్జిబిటర్లు వెళ్తామని తెలిపారు. తమ బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకుంటామని, చిరంజీవి ఇండస్ట్రీలోనే పెద్ద మనిషి అని చెప్పారు. ఆయన వద్ద తాము పెద్ది సినిమాకు వ్యతిరేకం కాదని కూడా చెబుతామని ఎగ్జిబిటర్ల ప్రతినిధులు వెల్లడించారు.
తమ డిమాండ్లను నిర్మాతలు పట్టించుకోవడం లేదని, కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ఆరోపించింది. నిర్మాతలు చెబుతున్న గ్రేడింగ్ విధానం కేవలం సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నమేనని వారు మండిపడ్డారు. తమకు ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదని, పాత అద్దె విధానం వల్ల చిన్న థియేటర్లు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు.. అందుకే పర్సంటేజ్ విధానం కావాలని అడుగుతున్నామని చెలిపారు.
ఈ సందర్భంగా ఎగ్జిబిటర్ విజయేందర్ మాట్లాడుతూ.. గతంలో హరిహర వీరమల్లు సినిమా సమయంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాలని అనుకున్నామని చెప్పారు. అయితే అప్పట్లో సమస్య పెద్దది అవుతుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ మూడు వారాల సమయం అడుగుతున్నారని, ఇది సరైన విధానం కాదని చెప్పారు. పెద్ది సినిమా నుంచైనా పర్సంటేజ్ సిస్టమ్ అమలు కావాలని ఆయన స్పష్టం చేశారు.
ఇంకొక ఎగ్జిబిటర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమా అయినా, మరే సినిమా అయినా తమ నిర్ణయం ఒక్కటేనని తెలిపారు. థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానం తప్పనిసరని పేర్కొన్నారు. దీంతో ఆ వివాదం త్వరలో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో భారీ సినిమాల విడుదలల సమయంలో రెంటల్, షేరింగ్ వ్యవహారాలు తరచూ వివాదాలకు దారి తీస్తున్నాయి.
ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, ప్రస్తుత విధానంలో తాము నిలబడటం కష్టమైందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం భారీ బడ్జెట్ సినిమాల వ్యాపార లెక్కలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా విడుదల సమయానికి ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? లేక వివాదం మరింత ముదురుతుందా? అన్నది చూడాలి.