పాన్ ఇండియా అసలైన మీనింగ్ చెప్పిన యంగ్ స్టార్
అసలైన పాన్ ఇండియా గుర్తింపు దక్కాలంటే ఆ కథలో ఉండే ఆత్మ, భావోద్వేగం దేశంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు.
`హనుమాన్` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు తేజ సజ్జా పాన్ ఇండియా చిత్రాల నిర్మాణం .. వాటి వెనుకున్న అసలైన సూత్రంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఒక సినిమా అనేక భాషల్లోకి డబ్ అయి లేదా అనేక రాష్ట్రాల్లో విడుదలైనంత మాత్రాన అది ప్యాన్ ఇండియా సినిమా అవ్వదని అభిప్రాయపడ్డారు. అసలైన పాన్ ఇండియా గుర్తింపు దక్కాలంటే ఆ కథలో ఉండే ఆత్మ, భావోద్వేగం దేశంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు.
పాన్ ఇండియా సినిమాకు ప్రాణవాయువు లాంటిది అందులోని మూల భావోద్వేగం అని తేజ సజ్జా వివరించారు. భాష, ప్రాంతం , సంస్కృతితో సంబంధం లేకుండా దేశంలో ఏ మూల ఉన్న ప్రేక్షకుడికైనా ఆ కథలోని ఎమోషన్ అర్థం కావాలని.. అది వారి మనసును తాకాలని పేర్కొన్నారు. కథలో ప్రధాన సంఘర్షణ లేదా భావోద్వేగం అందరికీ అనుసంధానమైనప్పుడే ఆ చిత్రం సరిహద్దులు దాటి అన్ని భాషల ప్రజల ఆదరణ పొందుతుందని వెల్లడించారు.
సాధారణంగా విభిన్న భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకోవడం లేదా వందల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం ద్వారానే పాన్ ఇండియా సినిమా అవుతుందని చాలామంది భావిస్తుంటారని, కానీ అది నిజం కాదని తేజ అభిప్రాయపడ్డారు. స్టార్ క్యాస్టింగ్, అత్యున్నత సాంకేతిక విలువలు కేవలం ప్రచారానికి, ప్రారంభ వసూళ్లకు మాత్రమే ఉపయోగపడతాయని.. కానీ సినిమాలో సరైన ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే ఏ ఒక్క ప్రాంతంలోనూ ఆ సినిమా ఎక్కువ కాలం నిలబడలేదని తేజ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా తాను నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం `హనుమాన్`అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. మన సంస్కృతిలో ఉన్న కథలు, స్థానిక మూలాలు , బలమైన మానవ సంబంధాల నేపథ్యం ఉన్న చిత్రాలకు దేశవ్యాప్తంగా ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని తెలిపారు. మన నేటివిటీకి సంబంధించిన మూలాలను పట్టుకుని కథను నిజాయితీగా తెరకెక్కించినప్పుడు.. ఆ కథ యూనిక్ రూపం దాల్చి సహజంగానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిందని.. వారు భాషా భేదాలను పక్కనబెట్టి మంచి కంటెంట్‌ను మాత్రమే ఆదరిస్తున్నారని తెలిపారు. డిజిటల్ విప్లవం, ఓటీటీల రాకతో ప్రేక్షకులు వివిధ భాషల సినిమాలకు అలవాటు పడ్డారని, కథలో బలం ఉంటే ఏ మూల నుంచి వచ్చిన చిత్రాన్నైనా ఆదరించడానికి భారతీయ ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
అంతిమంగా ప్యాన్ ఇండియా అనేది కృత్రిమంగా తొడిగే ఒక ల్యాబుల్ కాదని.. అది కథలోని భావోద్వేగం ద్వారా సహజంగా లభించే గౌరవమని తేజ సజ్జా వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో కూడా కథలో ఎమోషన్‌నే నమ్ముకుని, ప్రేక్షకులందరికీ నచ్చే వైవిధ్యమైన, బలమైన కథాంశాలతో ముందుకు వెళ్లడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.