ప్ర‌భాస్ ఇన్వాల్వ్ అయితేనే టైటిల్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం?

తాజా మీడియా ఇంట‌ర్వ్యూలో ర‌వీంద్ర మాట్లాడుతూ ఈ వివాదంపై పూర్తి వివ‌రాలు అందించారు. ర‌వీంద్ర మాట్లాడుతూ.."2024లోనే సెన్సార్ పూర్త‌యింది.. విడుద‌ల చేయాల‌నుకున్నా సరిప‌డా డ‌బ్బు లేక విడుద‌ల చేయ‌లేక‌పోయాము.

Update: 2026-07-14 16:37 GMT

"టైటిల్ మాత్ర‌మే కాదు.. సినిమా రిలీజ్‌నే ఆపేయా"ల‌ని టిసిరీస్ త‌మ‌ను బెదిరించింద‌ని ఆరోపిస్తున్నారు'స్పిరిట్ -ఈజ్ నాట్ వ‌న్' ద‌ర్శ‌కుడు ర‌వీంద్ర‌. 'స్పిరిట్' వ‌ర్సెస్ 'స్పిరిట్ ఈజ్ నాట్ వ‌న్' టైటిల్ వివాదం ఇటీవ‌ల ర‌చ్చ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా మీడియా ఇంట‌ర్వ్యూలో ర‌వీంద్ర మాట్లాడుతూ ఈ వివాదంపై పూర్తి వివ‌రాలు అందించారు. ర‌వీంద్ర మాట్లాడుతూ.."2024లోనే సెన్సార్ పూర్త‌యింది.. విడుద‌ల చేయాల‌నుకున్నా సరిప‌డా డ‌బ్బు లేక విడుద‌ల చేయ‌లేక‌పోయాము. రిలీజ్ చేయ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు కూడా డ‌బ్బులు అడిగారు. క్యూబ్ స‌హా అన్నిటికీ మేమే పే చేయాల‌ని అన్నారు. చివ‌రికి 7-8 ల‌క్ష‌లు ఉంటే రిలీజ‌వుతుంద‌ని మా ప్ర‌య‌త్నాలు మేం చేసాము. కానీ 10-20 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఏం ప్ర‌యోజ‌నం? ఓటీటీల‌కు వెళ్లండ‌ని కొంద‌రు స‌ల‌హా ఇచ్చారు. చివ‌రికి అమ్మ - నేను కొంత ఉన్న‌తంగా రిలీజ్ చేయాల‌ని 10ల‌క్ష‌ల వ‌ర‌కూ స‌మ‌కూర్చుకున్నాం. ఇంత‌లోనే మేం రిలీజ్ చేయాల‌నుకున్న త‌ర్వాత స్పిరిట్ మేక‌ర్స్ తో ఇబ్బందులు మొద‌ల‌య్యాయ``ని తెలిపారు.

రిలీజ్ స‌మ‌యంలోనే సందీప్ వంగా మేనేజ‌ర్ ఫోన్ చేసి మాతో ట‌చ్ లోకి వ‌చ్చారు. మా అడ్రెస్ లు అన్నీ తీసుకుని మాకు లీగ‌ల్ నోటీసులు పంపారు. టైటిల్ మార్పు కాదు.. ఏకంగా సినిమానే ఆపేయ‌మ‌ని వార్నింగ్ ఇచ్చారు. సినిమాని ఆప‌డానికి వారికి రైట్స్ ఏం ఉన్నాయి? అని ప్ర‌శ్నించాను.. అని తెలిపారు. టీసిరీస్ వాళ్ల‌కు లీగల్ నోటీసులు పంప‌డం స‌ర‌దా అంట‌! వాళ్లు నోటీస్ పంపిన‌ త‌ర్వాత మేం కూడా నోటీస్ పంపాము. త‌ర్వాత మ‌ళ్లీ రెండో నోటీస్ వ‌చ్చింది. పెద్ద కంపెనీ బెదిరించింద‌ని మేం బెదిరిపోలేదు. మేం క‌లిసిన లాయ‌ర్ కూడా ఈ కేసు నుంచి త‌ప్పుకున్నారు. చివ‌రికి కొంద‌రు సినీపెద్ద‌ల్ని క‌లిసి ఎవ‌రూ ముందుకు రాలేదు! అంటూ ఈ వివాదంపై ద‌ర్శ‌కుడు ర‌వీంద్ర ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సెన్సార్ వ‌చ్చాక రిలీజ్ ఆప‌డానికి ఎవ‌రికీ హ‌క్కు లేదు అని కూడా అన్నారు. హైకోర్ట్, సుప్రీంలోను మాకు అనుకూలంగానే ఉంటుంద‌ని ర‌వీంద్ర తాజా మీడియా ఇంట‌ర్వ్యూలో ఆశాభావం వ్య‌క్తం చేసారు.

ఒకే టైటిల్ తో ఇద్ద‌రు నిర్మాత‌లు సినిమాలు తీయ‌డంతో ఇప్పుడు టైటిల్ ఎవ‌రి సొంతం అనేదానిపై వివాదం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స్పిరిట్ కంటే ముందే తాము'స్పిరిట్- ఈజ్ నాట్ వన్' (SPIRIT IS NOT ONE) అనే చిన్న తెలుగు సినిమాని నిర్మించామ‌ని అయితే త‌మ టైటిల్ లో 'స్పిరిట్' అనే పదం ఉండటంపై బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ టి-సిరీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిందని ఆరోపిస్తున్నారు 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' చిత్ర నిర్మాతలు శ్రీమతి చిన్నబోయిన నరసమ్మ, శ్రీ వెంకటేశ్వర్లు. ఈ వివాదంలో టీసిరీస్ ని నిందించిన స‌ద‌రు నిర్మాత‌లు ప్ర‌భాస్ త‌మ‌కు న్యాయం చేస్తార‌ని ఇప్ప‌టికే మీడియా ఎదుట‌ ఆశాభావం వ్య‌క్తం చేసారు.

అయితే తాజాగా టి-సిరీస్ పంపిన నోటీసులలో ఏకపక్ష నిబంధనలను విధించినట్లు 'స్పిరిట్ ఈజ్ నాట్ వ‌న్' నిర్మాతలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 'స్పిరిట్' అనే పదంపై హక్కులు తమకే ఉన్నాయని క్లెయిమ్ చేస్తూ... ఈ చిన్న చిత్రాన్ని కేవలం తెలుగు భాషకే పరిమితం చేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీ వెర్షన్‌ను విడుదల చేయడంగానీ.. హిందీ హక్కులను విక్రయించడంగానీ చేయకూడదని టి-సిరీస్ షరతు పెట్టిందని నిర్మాత‌లు చెబుతున్నారు. థియేటర్లు, ఓటీటీ, యూట్యూబ్‌లలో కూడా కేవలం తెలుగు ప్రమోషన్స్‌కు మాత్రమే పరిమితమైతేనే ఈ లీగల్ నోటీసును వెనక్కి తీసుకుంటామని టి-సిరీస్ స్పష్టం చేసింద‌ని వారు చెబుతున్నారు.

ఈ కార్పొరేట్ బెదిరింపులపై తెలుగు నిర్మాతలు అత్యంత ఘాటుగా స్పందించారు. మా సినిమాను ఎవరికి అమ్ముకోవాలి? ఎక్కడ విడుదల చేయాలి? అనేది పూర్తిగా మా హక్కు. మాకు షరతులు విధించడానికి టి-సిరీస్ ఎవరు?? అంటూ నిలదీశారు. తాము తమ సినిమాను తెలుగులోనే విడుదల చేసుకుంటున్నామని.. ప్రభాస్ 'స్పిరిట్' చిత్రాన్ని హిందీలో టి-సిరీస్ సంతోషంగా విడుదల చేసుకోవచ్చని... దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెగేసి చెప్పారు. కేవలం పెద్ద సంస్థ అనే గర్వంతో తమపై ఒత్తిడి తేవాలని చూస్తే లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఒక పెద్ద బాలీవుడ్ సంస్థ ప్రాంతీయ భాషలోని చిన్న చిత్రాల హక్కులను, సృజనాత్మక స్వేచ్ఛను అణచివేయాలని చూడటం సరికాదని చిత్ర బృందం అభిప్రాయపడింది. ఎలాంటి ఏకపక్ష షరతులను తాము అంగీకరించబోమని చెబుతూ.. తమ హక్కులను కాపాడుకోవడానికి చట్టపరంగా ముందుకు సాగుతామని నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' చిత్రాన్ని థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భాస్ ఇన్వాల్వ్ మెంట్ త‌ప్ప‌నిస‌రి అని కూడా మేక‌ర్స్ అంటున్నారు. చివ‌రికి ప్ర‌భాస్ స్వ‌యంగా ఇన్వాల్వ్ అయి ప‌రిష్క‌రిస్తారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News