లీగల్ డ్రామా కాదు.. క్లాస్ డివైడ్‌పై వార్.. వైర‌ల‌వుతున్న సిస్టమ్ ట్రైలర్

కానీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిస్టమ్ వెబ్ సిరీస్ మాత్రం సాధారణ లీగల్ డ్రామా కాదనే అభిప్రాయం ట్రైలర్ రిలీజైన వెంటనే బలపడింది.

Update: 2026-05-13 06:42 GMT

బాలీవుడ్‌లో కోర్ట్‌రూమ్ డ్రామాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిస్టమ్ వెబ్ సిరీస్ మాత్రం సాధారణ లీగల్ డ్రామా కాదనే అభిప్రాయం ట్రైలర్ రిలీజైన వెంటనే బలపడింది. ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. డైరెక్ట‌ర్ అశ్వినీ అయ్య‌ర్ తివారీ ఈ సిరీస్‌ను కేవలం కోర్ట్ కేసుల చుట్టూ కాకుండా, సమాజంలో ఉన్న వర్గ వివక్ష, అధికారం, అవకాశాల అసమానతలపై నిర్మించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

ఇందులో సోనాక్షి సిన్హా, నేహా రాజ్‌వంశ్ అనే పాత్ర పోషిస్తుండ‌గా, కథకు ఆమె ప్రధాన కేంద్రంగా కనిపిస్తోంది. ప్రముఖ లీగల్ ఫర్మ్‌కు చెందిన ఆమె, సంస్థలో భాగస్వామ్య హోదా పొందడానికి వరుసగా పది కేసులు గెల‌వాల‌నే టార్గెట్ తో ముందుకెళ్తూ ఉంటుంది. అయితే తన విజయాల కోసం ఆమె తీసుకున్న కీలక నిర్ణయం కథను పూర్తిగా కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. అదే జ్యోతిక పోషిస్తున్న సారికా రావత్ పాత్రను టీమ్‌లోకి తీసుకోవడం. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన కోర్ట్ స్టెనోగ్రాఫర్‌గా సారికా కనిపించినా, ట్రైలర్‌లో ఆమె పాత్రలో దాగి ఉన్న వ్యక్తిగత ఉద్దేశాలు కథను మరింత తీవ్రంగా మార్చనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా నేహా- సారికా మధ్య ఏర్పడే అసౌకర్యకరమైన బంధమే ఈ సిరీస్ అసలు బలం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరు అధికారం, సంపద, ప్రివిలేజ్‌కు ప్రతీకగా కనిపిస్తే, మరొకరు కష్టాల్లో పెరిగిన సాధారణ మహిళగా నిలుస్తారు. కానీ కేసు ముందుకు సాగేకొద్దీ వారి మధ్య ఉన్న వృత్తిపరమైన సంబంధం వ్యక్తిగత సంఘర్షణగా మారిపోతుందనే అంశాన్ని ట్రైలర్ బాగా హైలైట్ చేసింది. ముఖ్యంగా సారికా, నేహా తండ్రి రవి రాజ్‌వంశ్‌కు ఎదురు నిలబడే సన్నివేశాలు కథలో ఎమోష‌న‌ల్ డెప్త్ ను పెంచనున్నాయి. ఈ పాత్రలో అశుతోష్ గోవారిక‌ర్ కనిపించడం మరో ఆసక్తికర అంశంగా మారింది.

డ‌బ్బు, ఇన్‌ఫ్లుయెన్స్, అధికారాల మధ్య సామాన్యుడి గొంతు ఎలా మాయమవుతుందనే సామాజిక వాస్తవాన్ని ఈ సిరీస్ కోర్ట్‌రూమ్ నేపథ్యంతో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇది కేవలం లీగల్ థ్రిల్లర్ గా కాకుండా, భారతీయ సమాజంలో ఉన్న క్లాస్ డివైడ్‌పై ప్రశ్నలు లేవనెత్తే డ్రామాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ‌వేజా స్టూడియోస్ ఈ సిరీస్‌కు హర్మన్ బవేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారి, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ ఘిల్దియాల్ కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. దహాడ్ తర్వాత మరోసారి గంభీరమైన పాత్రలో సోనాక్షి సిన్హా ఇందులో క‌నిపించ‌నున్నారు. హిందీ కంటెంట్‌లో జ్యోతిక‌కు కూడా ప్రాధాన్యత పెరుగుతుంద‌ని ఈ సిరీస్ నిరూపిస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తే సిస్టమ్ కోర్ట్‌రూమ్‌లో న్యాయం కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు, సమాజంలో నిజం ఎంత బలహీనంగా మారుతుందనే అంశాన్ని గట్టిగా ప్రశ్నించే సిరీస్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.


Full View


Tags:    

Similar News